
హుస్నాబాద్: కేసీఆర్‌కు ఓటేస్తే రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీకి మరో చెంచాగిరీ ఉంటాడని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సిద్ది పేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రజాఫ్రంట్ బలపర్చిన సీపీఐ అభ్యర్థి చాడ వెంకట్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక కోసం కేసీఆర్ మద్దతు తెలిపి మోదీకి చెంచాగిరీ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని విమర్శించారు.
కేసీఆర్‌కి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి తెలంగాణకు విముక్తి కల్పించాలని పిలుపు నిచ్చారు. ఇతర పార్టీలకు చెందిన 30 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్‌కు చట్టాలు, రాజ్యాంగంపై విలువ లేదని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. 2014 ఎన్నికల్లో సోనియా గాంధీకి కృతజ్ఞత తెలుపలేదని, ఈసారైనా కృతజ్ఞత తెలిపేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు కన్నయ్యకుమార్, మాజీ ఎంపీ అజీజ్‌పాష, చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.