సాక్షి, హైదరాబాద్: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా సీఎం కేసీఆర్ పాలన మార్చేసిందని, ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మరింత చెడు జరుగుతుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మరోసారి ప్రజావ్యతిరేక టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందుకే ఆ పాలనను అంతమొందించాలనే ఏకైక లక్ష్యంతోనే కూటమిలో సీపీఐ చేరినట్లు స్పష్టం చేశారు. మళ్లీ సీఎంగా కేసీఆర్ వస్తే రాష్ట్రానికి తీరని నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని పేర్కొన్నారు. కోటి ఎకరాలకు నీరిస్తామంటూ ఊదరగొట్టి ప్రారంభించిన భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో పారిన నీటి కంటే అవినీతే ఎక్కువ ఉందని ఆరోపించారు. అవినీతి ప్రవాహంతోనే కాల్వలు నిండిపోయాయని ధ్వజమెత్తారు. రాజులు, నవాబుల కంటే కూడా దారుణమైన పద్ధతుల్లో కేసీఆర్ వ్యవహార శైలి ఉందని, అందుకే ఆయనను ఓడించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో, ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుకు సంబంధించి సీపీఐకి చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. అయినా టీఆర్‌ఎస్‌ను ఓడించాలనే ధ్యేయంతో కూటమితో పాటు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ప్రీఫైనల్‌గా భావిస్తున్న 5 రాష్ట్రా ల ఎన్నికల్లో పాలక పక్షాలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీ అభివృద్ధి నినాదాన్ని పక్కనపెట్టి హిందూత్వవాద ఎజెండా ఎత్తుకుందని, ప్రధాని స్థాయికి తగ్గట్లు నరేంద్ర మోదీ మాట్లాడట్లేదన్నారు.
బీజేపీ వ్యతిరేక శక్తులు కలవాలి..
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందే విపక్షాల మధ్య అవగాహన సాధ్యమని సురవరం చెప్పారు. రాష్ట్రా ల్లోని పరిస్థితులను బట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేకశక్తులు కలవాల్సి ఉందని, మొత్తం 542 సీట్లలో 375–400 సీట్ల వరకు ఈ విధమైన అవగాహన ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పారు. సురవరం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు..
రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్‌తో, మరోసారి టీడీపీ, టీఆర్‌ఎస్‌లతో, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీలతో కలసి సీపీఐ ఎన్నికల్లో పోటీచేయడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి?
సురవరం: రాజకీయ విధానం, సమస్యలను బట్టే ఇలాంటి పొత్తులు ఏర్పడ్డాయి. ఇది రాజకీయ విధానంలో భాగంగానే జరిగింది తప్ప పార్టీలకు సంబంధించిన సమస్య కాదని ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. గతంలో వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్, టీడీపీలతో కలసి టీఆర్‌ఎస్ పోటీచేసింది. ఇప్పుడు అధికార పార్టీగా ఉంది కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తోంది.
కాంగ్రెస్, బీజేపీ విధానాలు ఒకేలా ఉన్నాయి కదా?
సురవరం: ఆర్థిక విధానాల విషయంలో కాంగ్రెస్, టీడీపీలు ఒకటే. బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద విధానాలు దేశానికి మరింత నష్టపరుస్తున్నాయి. ఈ విషయంలో ఒక పెద్ద శత్రువుగా బీజేపీ ముందు కొచ్చినపుడు కాంగ్రెస్ వంటి పార్టీ లేకుండా మతోన్మాద శక్తులను ఓడించడం సాధ్యం కాదు. దేశాన్ని పెద్ద ప్రమాదం నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలోని సెమీ ఫాసిస్ట్‌ను అంతం చేయాల్సిందే.
టీడీపీతో దోస్తీని ఎలా సమర్థించుకుంటారు?
సురవరం: బీజేపీ వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది కాబట్టే ఆ పార్టీతో పొత్తు. టీఆర్‌ఎస్‌ను ఓడించేం దుకు కాంగ్రెస్, టీడీపీ, ఇతర మిత్రపక్షాలతో కలసి సీపీఐ చేతులు కలిపింది.
నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్ పాలన ఎలా ఉంది?
సురవరం: ప్రజలకు మేలు చేకూర్చే ప్రాజెక్టులు, పరిశ్రమలు, సంక్షేమ కార్యక్రమాలపై కంటే కులాలు, మతాల వారీగా సంక్షేమం అంటూ, దేవుళ్లు, పుణ్యకార్యాలు అంటూ ప్రభుత్వ సొమ్మును పప్పూబెల్లాల మాదిరిగా పంచిపెడుతున్నారు. దళితులకు మూడెకరాలు, డబుల్‌బెడ్రూంలు, ఇంటింటికీ నల్లా వంటి వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి, ప్రజలకు నిరసనలు తెలిపే కనీస హక్కు కూడా లేకుండా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment