
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ ఒకరిపై ఒకరు లాలూచీ కుస్తీ చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ పాలనలో తీవ్రస్థాయిలో అవినీతి చోటుచేసుకున్నా కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐటీ దాడులు జరగలేదంటేనే మోదీ, కేసీఆర్‌ల మధ్య లాలూచీ స్పష్టమవుతోందని చెప్పారు. మంగళవారం మఖ్దూంభవన్‌లో పార్టీ నేతలు అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డి, బాలమల్లేశ్‌లతో కలసి సురవరం మీడియాతో మాట్లాడారు. బీజేపీకి బీ టీమ్‌గా టీఆర్‌ఎస్ మారిందని, ఢిల్లీలో మోదీని ఓడించాలంటే రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ స్టేట్‌లో నిజాం నవాబు పాలన కొనసాగింపునకు గతంలో ప్రయత్నించిన ఎంఐఎంకు కేసీఆర్ వంతపాడుతున్నారని, మరోవైపు బీజేపీకి టీఆర్‌ఎస్ మద్దతునిస్తోందన్నారు. ఆ అపవిత్ర కూటమి ఆడుతున్న నాటకానికి ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ మద్దతు
గత నాలుగున్నరేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమానికి కేసీఆర్ పూర్తి మద్దతు ప్రకటించారని సురవరం గుర్తు చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుతో పాటు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలను టీఆర్‌ఎస్ బలపరిచిందని, మోదీ ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపలేదని చెప్పారు. టీఆర్‌ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిరసనగా ఎన్నికల్లో ప్రజా కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అరెస్ట్ చేయడం ద్వారా భయందోళనలు సృష్టించే ప్రయత్నం జరిగిందన్నారు. ఇలాంటి చర్యల ద్వారా కేసీఆర్ ఆపద్ధర్మ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.
హైదరాబాద్‌లో మోదీ అబద్ధాలు..
నిరంకుశ నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని దాచిపెట్టి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ హైదరాబాద్‌స్టేట్‌కు విమోచన కల్పించారని బీజేపీ సభలో మోదీ అబద్ధాలు చెప్పారని సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ పోరాటంలో ప్రజలతో పాటు కమ్యూనిస్టు పార్టీదే కీలకపాత్ర అని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ లేకుండా తెలంగాణ విముక్తి సాధ్యమయ్యేది కాదన్నారు.