ఎంఐఎం ముఖ్య బాధ్యుల సమావేశంలో అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి,సిటీబ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతోనే మజ్లిస్‌కు ప్రధాన పోటీ అని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఆదివారం మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాంలో జరిగిన జిల్లా, పట్టణ స్థాయి పార్టీ ముఖ్య బాధ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశ నలుమూలలు మజ్లిస్‌కు మంచి ఆదరణ ఉందని, రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతోందని, అదే సమయంలో బీజేపీ బలం పుంజుకొంటోదన్నారు. బీజేపీని అడ్టుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునేందుకు గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని సూచించారు. మున్సిపల్ సిట్టింగ్ స్థానాలతో పాటు గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానాలు, కొత్త స్థానాల్లో సైతం అభ్యర్థులను పోటీకి దింపాలన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కనీసం 15 నుంచి 20 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని కనీసం వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన బాధ్యత పార్టీ జిల్లా, పట్టణ బాధ్యులదేన్నారు.
స్థానికంగా సమన్వయంతో సమర్థులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. ఒక వేళ స్థానికంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరగని పక్షంలో పార్టీ అధిష్టానం రంగంలో దిగి అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు. రిజర్వేషన్ స్థానాల్లో దళితులకు అవకాశం ఇవ్వాలని, వారితో సంప్రదింపులు చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీని అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment