సాక్షి, ముంబై(మహరాష్ట్ర): బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలు ఒకే నాణేనికి ఉన్న రెండు దిక్కుల వంటివని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. శనివారం తిరంగా యాత్ర బహిరంగ సభ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత నసీమ్ ఖాన్ ఆదివారం ఘాటుగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం కోటా గురించి ఎంఐఎం ఎందుకు నోరు విప్పలేదని ఆయన ప్రశ్నించారు.
విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్ కోటా గురించి బాంబే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అప్పటి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదన్నారు. అప్పుడు తాము కోటా గురించి పోరాడుతుంటే ఎంఐఎం చడీ చప్పుడు లేకుండా ఉందన్నారు. తమ పార్టీ నాయకులు శాసన సభలో తమ గళాన్ని వినిపించినప్పుడు ఎంఐఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు కలిసి రాలేదని ప్రశ్నించారు.
అప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఫడ్నవీస్ ప్రభుత్వానికి సహకరించారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీ ఎప్పుడు బీజేపీకి మద్దతుగా ఉండేందుకే పనిచేస్తుందని ఆరోపించిన నసీమ్ ఖాన్.. అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం నేతలకు ఎన్నికల సమయంలో మాత్రమే ముస్లిం రిజర్వేషన్ల అంశం గుర్తుకు వస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరికి వచ్చినందునే వారికి ఈ అంశం గుర్తుకు వచ్చిందన్నారు.
ముస్లింలకు కోటా కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎంఐఎం నిజ స్వరూపమేంటో ముస్లింలు అందరికీ తెలుసని పేర్కొన్న నసీమ్ ఖాన్.. ముస్లింల కోసం ఒవైసీ, ఎంఐఎం పార్టీ ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
చదవండి: మిస్ యూనివర్స్‌గా భారత యువతి
Comments
Please login to add a commentAdd a comment