
ఉండవల్లిలోని తన నివాసంలో ఎమ్మెల్యేలతో సమీక్షిస్తున్న మాజీ సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఉండవల్లిలోని ప్రజావేదికను ప్రతిపక్ష నేత అధికారిక నివాసానికి కేటాయించమని ప్రభుత్వాన్ని కోరాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసం, పార్టీ రాష్ట్ర కార్యాలయం గురించి చర్చించారు. ప్రజావేదిక చంద్రబాబు ఉంటోన్న ఇంటికి అనుబంధంగా ఉందని, దాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నివాసం కోసం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడగాలని పార్టీ నాయకులు సూచించగా, చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయం అందరికీ అందుబాటులో లేనందున విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు మరో భవనాన్ని చూడాలని చంద్రబాబు పార్టీ నాయకులు కేశినేని నాని, దేవినేని ఉమాకు సూచించారు.
ప్రస్తుతం ఉన్న జిల్లా కమిటీల స్థానంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలు వేద్దామని తెలిపారు. హైదరాబాద్‌లో ఏపీకి చెందిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం సరికాదని, కేబినెట్‌లో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కొందరు నేతలు వ్యాఖ్యానించగా, చంద్రబాబు మరికొందరు నేతలు అప్పుడే పరిపాలనా వ్యవహారాలపై విమర్శలు చేయకూడదని సూచించారు. లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా సీఎం రమేష్‌ను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు చినరాజప్ప, రామానాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.