పచ్చ గద్దలు: కృత్రిమ కొరతంటూ వికృత ఆరోపణలు! | TDP, Janasena Leaders Political Stunts on Sand Scarcity | Sakshi
Sakshi News home page

పచ్చ గద్దలు: కృత్రిమ కొరతంటూ వికృత ఆరోపణలు!

Published Sun, Nov 3 2019 7:50 PM | Last Updated on Sun, Nov 3 2019 8:10 PM

TDP, Janasena Leaders Political Stunts on Sand Scarcity - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు.. వరదల కారణంగా నెలకొన్న తాత్కాలిక ఇసుక కొరత సమస్యను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీతో ఉన్న అవగాహన మేరకు జనసేనాని పవన్‌ కళ్యాణ్ కూడా లాంగ్ మార్చ్‌ అంటూ ఆరోపణలకు దిగుతున్నారు. మరికొద్దిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఇసుక సమస్యే ఉండదని ప్రభుత్వం చెప్తోంది. నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం బురద రాజకీయాలకు పాల్పడ్డం దారుణమని సర్కార్‌ ఆక్షేపిస్తోంది.

ఐదేళ్ల టీడీపీ పాలనలో వర్షాలు లేక, వరదలు రాక ఆంధ్రప్రదేశ్‌లో కరువు కరాళనృత్యం చేసింది. నదులన్నీ జలకళ కోల్పోయాయి. నీళ్లులేక ఎడారులుగా మారిన నదులపై టీడీపీ అగ్రనేతలు కన్నేశారు. నిబంధనలకు నీళ్ళొదిలేసి.. టీడీపీ నేతలు ఇసుక రీచ్‌లను పంచుకున్నారు. ఇసుక సామ్రాజ్యాన్ని స్థాపించుకొన్నారు. యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి కోట్లకు పడగలెత్తారు. అడ్డగోలు దందాను అడ్డుకొన్న అధికారులపై ఒంటికాలుమీద లేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాక్షాత్తు టీడీపీ శాసనసభ్యుడే మహిళా తాహశీల్దార్‌ వనజాక్షిపై దాడిచేసాడు. మహిళా అధికారి అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని కాలితో కడుపులో తన్నాడు. నా అడ్డాలోకే వస్తావా అంటూ రాయలేని భాషలో దుర్భాషలాడాడు. ఇసుక కాసులకోసం పసుపు తమ్ముళ్ల బరితెగింపు బజారునపడ్డా అధినేత చంద్రబాబు చలించలేదు. పైగా ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు లేకుండా రాజీ కుదిర్చి అధికారుల నోళ్లు మూయించారు. దాంతో తెలుగు తమ్ముళ్లు మరింత రెచ్చిపోయారు. ఇసుకను యథేచ్ఛగా రాష్ట్ర సరిహద్దులు దాటించారు. ఇసుక డిమాండ్ ఉన్న బెంగళూరు, చెన్నై నగరాలకు తరలించి సొమ్ముచేసుకొన్నారు. ఇంత దారుణంగా మహిళా అధికారిపై దాడి జరిగితే పవన్ కళ్యాణ్ కనీసం నోరు మెదపలేదు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని కూడా ఆయనకు అనిపించలేదు.

ఇరవై ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక స్మగ్లర్లుగా మారి దొంగ వ్యాపారం చేశారు. రాజధాని నడిబొడ్డులో చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో నదీపరీవాహక చట్టాలకు తూట్లు పొడిచారు. డ్రెడ్జర్ల ద్వారా నదిలోని ఇసుక తోడి అమరావతి నిర్మాణాలకంటూ కవరింగ్ ఇచ్చారు. అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు ఇసుక అక్రమ తవ్వకాల గురించి అస్సలు పట్టించుకోలేదు. టీడీపీ ఇసుకాసురులకు చెక్ పెట్టాలని భావించి పర్యావరణహితం కోరే ఓ సామాజికవేత్త జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. దాంతో విచారణ చేసిన గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ప్రభుత్వానికి వందకోట్ల జరిమానా విధించింది. ఇప్పటికీ ఈ వివాదం చంద్రబాబు మెడకు చుట్టుకొనే ఉంది. టీడీపీ నేతలు సృష్టించిన ఇసుక సామ్రాజ్యానికి అండగా నిలిచిన చంద్రబాబు ఇప్పుడు నీతులు వల్లించటం దెయ్యాలు వేదాలు వళ్లించటమేనని అధికారపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఇసుక మాఫియా ఆగడాల పాపం పండటంతోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని పక్కన పెట్టారు. టీడీపీకి కేవలం 23 స్థానాలు దక్కాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పట్టంకట్టారు. వైఎస్‌ జగన్ అధికారంలోకి రాగానే పదేళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయి. నదులన్నీ జలకళతో మెరిశాయి. చెరువులకు సమృద్ధిగా నీరు రావటంతో నిండు కుండల్ని తలపిస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వ్యవసాయానికి పుష్కలంగా సాగునీరు అందుతోంది. నీటి చుక్కకోసం ఐదేళ్లు ఎదురుచూసిన నేలతల్లి ఇప్పుడు పులకరించిపోతోంది. పల్లెల్లో ప్రశాంతత నెలకొంది. అదే సమయంలో నదుల్లో వరద ప్రవాహం ధాటికి ఇసుక తవ్వకాలకు వీలుపడని పరిస్థితులు నెలకొన్నాయి. సహజంగానే ఇసుక కొరత నెలకొంది. ఇపుడీ కొరతనే భూతద్దంలో చూపించి రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు చంద్రబాబు.

వర్షాలు, వరదలు కొనసాగుతుండటంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల మాత్రమే కొత్త రీచ్‌లు ప్రారంభించారు. కొంతమేర ఇసుక సేకరించి నిర్మాణ పనులకు అప్పగించారు. అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో వర్ష ప్రభావం పెరిగి ఇసుక సేకరణ పూర్తిగా నిలిచిపోయింది. తమ ఇసుక దందాకు చెక్ పెట్టేలా కొత్త పాలసీ తెచ్చారన్న అక్కసుతో  పచ్చనేతలు ఇసుకను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ప్రకృతి వల్ల ఇసుక కొరత ఏర్పడితే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ వికృత ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఉండగా ఆందోళనలు చేసినా భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారు. మహిళా అధికారిపై దాడి చేసిన ఇసుకాసురుడిని జైలుకెళ్లి కలిసొచ్చిన చినబాబు లోకేష్ ఇసుక  సమస్యపై తాను పరాజయం పాలైన మంగళగిరిలో వీధినాటకాన్ని రక్తి కట్టించారు.

విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  చేత లాంగ్ మార్చ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబే  ప్లాన్ చేశారు. వరదలు తగ్గతే ఇసుక వారోత్సవాలు నిర్వహించి ఇసుక కొరత లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వరదల కారణంగానూ నదుల్లో విపరీతమైన ప్రవాహాల కారణంగానూ తాత్కాలికంగా ఇసుక కొరత ఉన్న విషయం వాస్తవమేనని ప్రభుత్వం అంగీకరిస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ సమస్య శాస్వతంగా పరిష్కారం అవుతుందని భరోసా ఇస్తోంది కూడా. ఈ లోపే టీడీపీ-జనసేన పార్టనర్‌షిప్ సమ్మిట్‌లా లాంగ్ మార్చ్ కు  స్కెచ్ గీశాయని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేతలంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement