
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు బరితెగించారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం పార్టీ ఫండ్ పేరుతో వ్యాపారులు, కాంట్రాక్టర్లకు టార్గెట్స్ పెట్టి మరీ వసూలు చేస్తు న్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముగిసిన ప్పటికీ ‘పార్టీ ఫండ్’ను మాత్రం వదలట్లేదు. వీలు న్నంత వరకు వెనకేసుకోవాలనే ఉద్దేశంతో రెచ్చి పోతున్నారు. వీరి బాధపడలేక విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చేసిన ఓ వ్యాపారి విషయంలో హద్దులు మీరారు. ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరు చెప్పి, ఆయన అధికారిక నివాసం ల్యాండ్‌లైన్ నుంచే ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సోమవారంలోపు తాము డిమాండ్ చేసిన రూ.8 కోట్లు చెల్లించకపోతే కుటుంబంతో సహా హతమారుస్తామంటూ బెదిరిస్తున్నారు. వీరి ఆగడాలు మితిమీరడంతో సదరు వ్యాపారి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమవాడే అయినా!
విజయవాడకు చెందిన వీరపనేని రవికాంత్ ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, ఒడిశాల్లోనూ మనోహర గ్రీన్స్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తుంటారు. కొన్నేళ్లు టీడీపీకి సానుభూతిపరుడిగా, పార్టీకి అనుబంధంగా పని చేశారు. అనివార్య కారణాల నేపథ్యంలో కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గతనెల వరకు ఆయన విషయం పట్టించుకోని టీడీపీ నాయకులు ఎన్నికల నగారా మోగడంతో వసూళ్లపై దృష్టి పెట్టారు. టీడీపీకి చెందిన ఓ మాజీ కేంద్రమంత్రికి సన్నిహితంగా మెలిగే వెంకట్రావు నాయుడు.. ఈ వ్యాపారిని సంప్రదించారు. దాదాపు ఏడాదిగా వీరిద్దరికీ పరిచయం ఉంది.
వెంకట్‌రావు గతంలో రవికాంత్‌తో రూ.10 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు చేశారు. ఇలా రవికాంత్ ఆర్థికస్థితిపై ఓ అంచనాకు వచ్చిన నాయుడు ఆపై అసలు కథ మొదలెట్టారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ కోసం ఫండ్ ఇవ్వాలని కోరారు. తన ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా లేదని చెప్పిన వ్యాపారి.. ఈసారికి తానేమీ చేయలేనన్నారు. ఈమధ్య తానే రూ.10కోట్ల వ్యాపారం ఇచ్చానని, ఇలా ఎందరో ఇచ్చి ఉంటారని మాట్లాడిన వెంకట్‌రావు.. డబ్బు ఇవ్వాల్సిందేనని, సీఎం చంద్రబాబు మీకు రూ.8 కోట్ల ఫండ్ టార్గెట్ పెట్టారని చెప్పాడు. ఆ మొత్తం ఇవ్వడం తన వల్ల కాదంటూ వ్యాపారి చెప్పడంతో దొరబాబు, శ్రీనివాస్ అనే మరో ఇద్దరు రంగంలోకి దిగారు.
మళ్లీ మన ప్రభుత్వమే!
ఏప్రిల్ 7న ఆయన వ్యాపార పనులకోసం ఒడిశా వెళ్ళగా ఆయనకు ఫోన్ చేసిన వెంకట్‌రావు, దొరబాబు డబ్బు విషయం ఏమైందంటూ అడిగారు. ఈయన నుంచి స్పందన లేకపోవడంతో 9వ తేదీ నుంచి శ్రీనివాస్ అనే మరో వ్యక్తి రంగంలోకి దిగాడు. తాను ఏపీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడిని అంటూ పరిచయం చేసుకున్నాడు. తమ వాళ్లు కోరిన మొత్తం ఇవ్వాలని, మీ విషయంపై సీఎంగారు ప్రత్యేక దృష్టి పెట్టారని, మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి.. కాంట్రాక్టులు ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నారని చెప్పాడు. ఈయనతో కూడా అంత మొత్తం ఇవ్వడం తనతో కాదని రవికాంత్ చెప్పినా.. పట్టించుకోలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో తాను విజయవాడ వెళ్తే ఇబ్బందులు వస్తాయని భావించిన వ్యాపారి ఒడిశా నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. రాణిగంజ్‌లో ఉన్న ఓ హోటల్‌లో బస చేశారు. పోలింగ్ ముందురోజు నుంచి ఆ టీడీపీ నేతల ధోరణి మారిపోయింది. అప్పటి వరకు జాగ్రత్తగా మాట్లాడిన వీళ్లు.. ఆ తర్వాత బెదిరింపులకు దిగడం మొదలెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. సాధారణంగా పార్టీ ఫండ్స్ తదితరాలను పోలింగ్ వరకే తీసుకుంటూ ఉంటారు. టీడీపీ నేతలు రవికాంత్ నుంచి ఎన్నికలు అయిపోయినా సరే.. రూ.8 కోట్లు వసూలు చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు.
ఏపీ సీఎం ఇంటి నంబరునుంచే
రవికాంత్‌తో వెంకట్రావ్ నాయుడు అనునిత్యం వాట్సాప్ ద్వారానే మాట్లాడుతూ, సందేశాలు పంపుతూ వచ్చాడు. మిగిలిన వారిలో ఏపీ సీఎం వ్యక్తిగత సహాయకుడిగా చెప్పుకున్న శ్రీనివాస్ మాత్రం సీఎం అధికారిక నివాసం ల్యాండ్‌లైన్ నెంబర్ (0863–2499999) నుంచే వ్యాపారి సెల్‌ఫోన్‌కు ఫోన్లు చేశారు. పోలింగ్ ముందు రోజు (10వ తేదీ) నుంచి ఫండ్ వసూలు చర్యల్ని వేగవంతం చేశారు. సదరు వ్యాపారి రాణిగంజ్‌లోని హోటల్‌లో బస చేసిన విషయం తెలుసుకున్న వీళ్ళు.. నువ్వెక్కడున్నావో మాకు తెలుసని వివరాలు చెప్పి.. భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటూ బెదిరింపులు మొదలెట్టారు. భయపడిన బాధితుడు అక్కడ నుంచి తన మకాం బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాకు మార్చారు.
మళ్లీ ఫోన్ చేసిన వెంకట్రావ్ మకాం మార్చిన విషయాన్నీ చెప్పడంతో పాటు ఎక్కడకు వెళ్లినా తమ వాళ్లు నీడలా వెంటాడుతూ ఉంటారని బెదిరించాడు. రూ.8 కోట్లు ఇవ్వడం మినహా మరో మార్గం లేదని హెచ్చరించాడు. గురువారం పోలింగ్ ముగిసినప్పటికీ ఇతడు వదిలిపెట్టలేదు. శుక్ర, శనివారాల్లోనూ సదరు వ్యాపారికి కాల్స్ చేస్తూనే ఉన్నాడు. పోలింగ్ ముగిసింది కదా? ఇంకా పార్టీఫండ్ ఏమిటంటూ.. అడిగినప్పటికీ తప్పదంటూ సమాధానం వచ్చింది. తాము డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వకుంటే పంజగుట్ట చౌరస్తాలో కుటుంబం మొత్తాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.
పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు
ఈ పరిణామంతో భయభ్రాంతులకు గురైన రవికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. తాను హైదరాబాద్‌లోని హరిత ప్లాజా హోటల్‌లో ఉండగానే తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన, బెదిరింపుల పూర్వాపరాలు పరిశీలించిన అధికారులు కోర్టు అనుమతి తీసుకుని కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. టీడీపీ నాయకులు, సీఎం వ్యక్తిగత సహాయకుడిగా చెప్పుకున్న వ్యక్తి తనకు సోమవారం డెడ్‌లైన్‌గా పెట్టారని రవికాంత్ చెబుతున్నారు. ఆలోపు రూ.8 కోట్లు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరిస్తున్నారని, మళ్లీ ఏపీలో తమ ప్రభుత్వమే వస్తుందని, నీవు వ్యాపారాలు ఎలా చేస్తావో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారని బాధితుడు వాపోతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని ఆయన హైదరాబాద్ పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment