నగరిలో టీడీపీ నేతల దాడిలో గాయపడిన ఎమ్మెల్యే రోజా (ఫైల్) ,సోమల మండలం లక్ష్మీపురంలో జరిగిన దాడిలో గాయపడిన వెంకట్రామయ్య (ఫైల్)
చిత్తూరు అర్బన్: అధికార పార్టీ ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. విపక్షం గొంతు నొక్కడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుంటోంది. జిల్లాలో తరచూ వైఎస్సార్‌సీపీ నాయకులు..కార్యకర్తలపై జరుగుతున్న దౌర్జన్యాలే ఇందుకు సాక్ష్యం. గట్టిగా మాట్లాడితే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
♦ 2014 నుంచి ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 300 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సుమారు 200 మందిపై భౌతిక దాడులకు పాల్పడ్డారు.
♦ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 2016లో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు ఎంపీ హోదాలో స్వాగతం పలకడానికి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వెళ్లారు. అక్కడున్న సీఐఎఫ్ ఉద్యోగులు మిథున్‌రెడ్డిని అడ్డుకోవడంతో చిన్నపాటి వాగ్వాదం జరిగితే కేసు పెట్టి, మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు.
♦ నగరిలో జాతరకు సారె తీసుకెళుతున్న ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేతలు భౌతిక దాడులు చేశారు. 2015లో జరిగిన ఘటనలో రోజాకు గాయాలయ్యాయి. అయినా కూడా టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యేపైనే పోలీసులు కేసు నమోదు చేశారు.
♦ నగరి మునిసిపల్ చైర్‌పర్సన్ కేజే శాంతి వస్త్రాలను చింపి స్థానిక టీడీపీ నేతలు దాడి చేశారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన పోలీసులు టీడీపీ నేతల ఆదేశాలతో శాంతిపైనే కేసు పెట్టారు. తమపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని శాంతికుమార్ ఆవేదన వ్యక్తంచేశారు.
♦ రెండు నెలల క్రితం పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని లక్ష్మీపురంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ నాయకులపై టీడీపీ నాయకులు దాడిచేశారు. ఈ ఘటనలో వెంకట్రామయ్య గాయపడ్డారు. ఆయన్ను పరా మర్శించేందుకు వెళ్లిన తంబళ్లపల్లె సమన్వయకర్త ద్వారకనాథరెడ్డి, ఆయన అనుచరులపై కూడా టీడీపీ నాయకులు దాడులు చేశారు. అటుపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరుగురిపై టీడీపీ వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తప్పుడు కేసు నమోదైంది.
♦ పూతలపట్టు నియోజకవర్గంలో తవణంపల్లె మండలం ఆగస్టులో కొత్తగొల్లపల్లె రోడ్డుపై ఉన్న నీరుపైన పడిందన్న సాకుతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఉమాపతిపై టీడీపీ నాయకులు శంకర్ కత్తి దాడిచేసి గాయపరిచాడు. శంకర్ అనుచరులు వైఎస్సార్‌సీపీకి చెందిన వాసు మరికొంతమందిపై కర్రలు, కత్తులతో దాడులు చేశారు.
♦ కుప్పంలో రోజురోజుకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేని టీడీపీ నేతలు నాలుగేళ్లలో 38 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారు.
♦ గుడిపాల మండలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జంగాలపల్లె శ్రీనివాసులు, గాయత్రీదేవి తదితరులు ఇంటింటా ప్రచార కార్యక్రమానికి వెళితే ఓర్వలేని టీడీపీ నేతలు నడిరోడ్డుపైనే రాళ్లతో దాడులు చేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం తప్ప మరే చర్యలు తీసుకోలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment