ఏరీ... ఎక్కడ! | TDP Leaders Disappear After Elections Results in East Godavari | Sakshi
Sakshi News home page

ఏరీ... ఎక్కడ!

Published Thu, Sep 12 2019 11:25 AM | Last Updated on Thu, Sep 12 2019 11:32 AM

TDP Leaders Disappear After Elections Results in East Godavari - Sakshi

గంటి హరీష్‌ మాధుర్‌, మాగంటి రూప

ప్రజా ప్రతినిధి అంటే ఓడినా, గెలిచినా నిత్యం ప్రజల మధ్యనే ఉండాలి. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. గెలిస్తే ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఓటర్ల మన్ననలు అందుకోవాలి. ఓడితే ఆ కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాసటగా నిలవాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థులుగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్, మాగంటి రూప, గంటి హరీష్‌ల జాడే కానరాకపోవడం గమనార్హం.

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): అధికారం ఉంటే హల్‌చల్‌ చేస్తారు. ఆ అధికారం దూరమైతే ఆచూకీలేకుండా పోతారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు హడావుడి... తెలుగుదేశం పార్టీ నేతల తీరు ఇదీ అని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాల నుంచి పోటీచేసి ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ అభ్యర్థుల ఆచూకీ కోసం ఆయా నియోజకవర్గ ప్రజలు భూతద్దాలు పెట్టి వెతికినా కనిపించడంలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనాన్ని సృష్టించి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటిపోయింది. ఇన్ని నెలలయినా టీడీపీ నుంచి  పోటీ చేసిన ముగ్గురు పార్లమెంటు అభ్యర్థుల జాడ పార్టీ కార్యక్రమాల్లో లేకుండా పోయింది.  

మురళీ రాగం ఏమైంది...?
మూడు నెలల కిందట ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్లమెంటు స్థానాల నుంచి టీడీపీ ఓటమిని మూటగట్టుకుంది. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థులు మాగంటి రూప, చలమలశెట్టి సునీల్, గంటి హరీష్‌ మాధుర్‌ ఎన్నికలైపోయాక నియోజకవర్గాన్నే మరచిపోయారు. సినీ నటుడు మాగంటి మురళీమోహన్‌ రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి ఎంపీ కావాలని కలలుగని తొలిసారి 2009లో పోటీచేసి మహానేత వైఎస్‌ గాలిలో ఓటమి చవిచూశారు. అప్పుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై పోటీచేసి ఓడిపోయిన మురళీమోహన్‌ ఆ తరువాత సేవా కార్యక్రమాలతో పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతూండే వారు. తరువాత 2014లో పోటీచేసి ఎంపీ కావాలనే కలను మురళీమోహన్‌ సాకారం చేసుకున్నారు. ఎంపీ అయ్యాక  కోడలు రూపను వెంట తిప్పుకుంటూ తన రాజకీయ వారసురాలుగా ఎంపీకి పోటీ చేస్తారనే సంకేతాల్లో పంపించారు. ఆ క్రమంలోనే గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎంపీగా కోడలు రూప బరిలోకి దిగగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌ చేతిలో లక్షపై చిలుకు ఓట్ల తేడాతో ఘెర పరాజయాన్ని మూటగట్టుకోక తప్పింది కాదు. అప్పటి నుంచి మామ, కోడలు జనానికి దూరమయ్యారు. స్థానికత్వం కోసం రాజమహేంద్రవరం వెంకటేశ్వరనగర్‌లో మురళీమోహన్‌ సొంత ఇల్లు కూడా నిర్మించుకున్నారు. ఈ నెలాఖరుకు రాజమహేంద్రవరంలోని ఇంటిని కూడా ఖాళీచేసి రాజకీయాలకు ప్యాకప్‌ చెప్పేందుకు సిద్ధపడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇంటి వద్ద పనిచేస్తున్న సిబ్బందికి నెలాఖరు వరకూ మాత్రమే పని ఉంటుందని, ఆ తరువాత ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పేశారంటున్నారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇక్కడే ఉండి సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని మురళీమోహన్‌ చెప్పిన మాటలు ఏమయ్యాయని పార్టీ కేడర్‌ ప్రశ్నిస్తోంది.

గంటి హరీష్‌దీ అదే దుస్థితి
అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి ఓటమిచెందిన గంటి హరీష్‌ మాధుర్‌ది కూడా దాదాపు అదే పరిస్థితి. లోక్‌సభ దివంగత స్పీకర్‌ జీఎంసీ బాలయోగికి ఉన్న పేరు, ప్రతిష్టలు, బాలయోగి వారసుడిగా సానుభూతి కలిసి వస్తుందని అతని కుమారుడు మాధుర్‌ను టీడీపీ బరిలోకి దింపింది. బాలయోగిపై ఉన్న సానుభూతితో గెలుపు ఖాయమనే అతి విశ్వాసానికి పోయిన ఆ పార్టీ ఫలితాల్లో బోర్లాపండింది. ఓటమి తరువాత మాధుర్‌ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. అమలాపురం నల్లవంతెనకు సమీపాన ఇల్లును అద్దెకు తీసుకుని స్థానికంగా ఉంటామని ఎన్నికలప్పుడు నమ్మకాన్నికలిగించే ప్రయత్నం చేశారు. తీరా ఓడిపోయాక గడచిన మూడు నెలల్లో పార్లమెంటు పరిధిలో ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్న దాఖలాలు లేవు. బాలయోగి వారసుడిగా పార్టీకి ఓ ఊపు వస్తుందనుకున్న అధిష్టానం అంచనాలు తలకిందులయ్యాయి.

సునీల్‌ సీను అంతే...
జిల్లా కేంద్రం కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి మూడోసారి ఓటమి తరువాత చలమలశెట్టి సునీల్‌ ఎక్కడున్నాడో పార్టీ శ్రేణులకు కూడా తెలియడం లేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ, 2014 వైఎస్సార్‌సీపీ, 2019లో టీడీపీ...ఇలా మూడు ఎన్నికలు ... మూడు పార్టీలన్నట్టుగా పోటీచేసిన సునీల్‌ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే అయినా మూడు ఎన్నికల్లో వరుస ఓటముల తరువాత పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించే సాహసం చేయలేకపోతున్నారంటున్నారు. వాస్తవానికి సునీల్‌ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ కాకినాడ ఎల్‌బీ నగర్‌లో పెద్ద బిల్డింగ్‌ అద్దెకు తీసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహించే వారు. అటువంటి భవనం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. ఎన్నికల ముందు రావడం ... ఓటమి తరువాత కనిపించకుండా పోవడం షరామామూలేనని అంటున్నారు. ఇలా ముగ్గురు టీడీపీ పార్లమెంటు అభ్యర్థులు జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరమైపోయారు. ఇటీవల చంద్రబాబు కాకినాడలో పార్టీ జిల్లా సమీక్షా సమావేశానికి వచ్చినప్పుడు మురళీమోహన్, రూప, సునీల్‌ మొహం చాటేశారు. ఎటొచ్చీ హరీష్‌మాధుర్‌ ఆ ఒక్క రోజు మాత్రమే వచ్చి ఆ తరువాత జిల్లాలో కనిపించలేదు. ఇలా ఓటమి తరువాత పార్లమెంటు నియోజకవర్గాన్ని విడిచిపెట్టిపోయే నేతల తీరును క్యాడర్‌ ఏవగించుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement