సాక్షి, కాకినాడ: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి తూర్పుగోదావరి జిల్లా ముఖ్య నాయకులు ఝలక్ ఇచ్చారు. గురువారం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన టీడీపీ విస్తృతస్థాయి సమీక్ష సమావేశానికి ముఖ్యనేతలు గైర్హాజరయ్యారు. కాకికాడ, రాజమండ్రి లోక్సభ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్, మాగంటి రూప ఈరోజు సమావేశానికి హాజరుకాలేదు. రామచంద్రపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీచేసిన తోట త్రిమూర్తులు కూడా ముఖం చాటేశారు. వీరు ముగ్గురు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తోట త్రిమూర్తులు టీడీపీని వీడతారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్య నేతలు సమావేశానికి రాకపోవడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలోని కాపు నాయకులు గత జూన్‌లో రహస్య సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీసిన విషయం తెలిసిందే (చదవండి: టీడీపీ కాపు మాజీ ఎమ్మెల్యేల రహస్య భేటీ)
చంద్రబాబు పర్యటనకు కాకినాడ నేతలు దూరం
టీడీపీ జిల్లా స్దాయి విస్తృత సమావేశం, నియోజకవర్గాల సమీక్షలకు కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడు నున్న దొరబాబు, జిల్లా మహిళ అధ్యక్షురాలు అడ్డూరి లక్ష్మీ శ్రీనివాస్, తొమ్మిది మంది కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే సీటును వనమాడి కొండబాబుకు కేటాయించవద్దని వీరంతా చంద్రబాబును కోరారు. తమ మాట వినిపించుకోకుండా కొండబాబుకు టిక్కెట్ ఇవ్వడంతో వీరందరూ అసంతృప్తిగా ఉన్నారు. తమ వినతిని చంద్రబాబు పట్టించుకోక పోవడంతో ఆయన పర్యటనకు దూరంగా ఉన్నారు. (చదవండి: చంద్రబాబుతో భేటీకి కాపు నేతల డుమ్మా)
Comments
Please login to add a commentAdd a comment