వైజాగ్‌ను చెరబట్టిన టీడీపీ భూ మాఫియా | TDP Leaders Land Pooling in Visakhapatnam | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ను చెరబట్టిన టీడీపీ భూ మాఫియా

Published Fri, Apr 5 2019 9:21 AM | Last Updated on Fri, Apr 5 2019 12:32 PM

TDP Leaders Land Pooling in Visakhapatnam - Sakshi

అనగనగా ఓ అందాల నగరం...దానికితోడుగా సుందరమైన సముద్ర తీరం...ఆపై ప్రకృతి సోయగంతో అలరారే ప్రాంతం...ప్రశాంతతకు మారుపేరుగా సాగే జీవనం...వీటిపై కన్నేసింది ‘అధికారా’క్షస గణం...బెదిరింపులతో బెంబేలెత్తించిందా దళం...చేతికందిందంతా చెరబట్టిందా పచ్చ మూక...అశాంతి రేపి కోట్లకు కోట్లు కాజేసిందా దండు...పెద్దపెద్ద తుపాన్లనే తట్టుకున్న ఆ నగరం...భూ రాబందుల దెబ్బకు మాత్రం విలవిల్లాడింది...ముఖ్య నేతల మాఫియాలో చిక్కి నిలువెల్లా వణికింది...నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని కాస్తా నివ్వెరబోయింది...– గరికిపాటి ఉమాకాంత్‌ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

ప్రకృతి గీసిన ఛాయాచిత్రంలా ఉండే అందమైన విశాఖ నగరం శివారులోని పచ్చటి పొలాల్లో సాగు చేసుకుంటున్న రైతుల వద్దకు రెండున్నరేళ్ల కిందట టీడీపీ నేతలు పంపిన దళారులు వెళ్లారు. ‘ఇక్కడ ఇళ్లు కడతారు. భారీఎత్తున పరిశ్రమలొస్తాయి. మీ పొలాలను ఎలాగైనా బలవంతంగా లాక్కుంటారు. ఈ రహస్యం ఎవరికీ చెప్పకండి. ముందుగానే వాటిని అమ్మేసుకుంటే మంచిది. లేదంటే, తర్వాత దక్కినదానితో సంతృప్తి పడాల్సి ఉంటుంది’ అంటూ ఆందోళన రేకెత్తేలా బెదిరించారు. అమాయక రైతులు ఇది నిజమేనని నమ్మారు. ఎకరా రూ.కోటి విలువ చేసే భూమిని రూ.పది, పన్నెండు లక్షలకే అమ్మేసుకున్నారు. వీటిని కొన్నదంతా టీడీపీ నేతల బినామీలే. ఇలా కొనుగోళ్లు పూర్తయ్యాయో లేదో ముందస్తు కుట్రలో భాగంగా ఇళ్ల నిర్మాణానికి, పరిశ్రమల ఏర్పాటుకు భూమి సేకరిస్తామని ప్రభుత్వం నుంచి భూ సమీకరణ (ల్యాండ్‌ ఫూలింగ్‌) ప్రకటన వచ్చింది. టీడీపీ నేతలతో కుమ్మక్కైన విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)నే ఈ భూ సమీకరణ పనిని చేపట్టింది. అప్పటికే రైతుల నుంచి తక్కువ ధరకు కొట్టేసిన భూములను టీడీపీ నేతలు వుడాకు అప్పజెప్పి తమ జేబులు నింపుకొన్నారు. ఈ కుంభకోణంలో ఇదో పార్శ్వం మాత్రమే.

దేన్నీ వదల్లేదు..: డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు... ఇలా టీడీపీ నేతలు దేన్నీ వదల్లేదు. అధికారం అండతో ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు.  బాధితులు నెత్తినోరు బాదుకున్నా వినలేదు. కొందరు అధికారులు కుమ్మక్కైతే, మరికొందరి మెడపై అధికారమనే కత్తి పెట్టి పనులు చేయించుకున్నారు. ఇక రికార్డుల తారుమారు ఇందులో పరాకాష్ట. ఒకరి బ్యాంకు ఖాతా నుంచి మరొకరి బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అయినంత సులువుగా భూ రికార్డులు మారిపోయాయి. కచ్చితంగా చెప్పాలంటే... ఓవైపు రైతు తన భూమిలో సాగు చేస్తుండగానే... తహసీల్దార్‌ కార్యాలయాల్లో  ఆ భూమి వేరొకరికి ధారాదత్తం అయిపోయింది.

సీఎం కార్యాలయానికి ప్రత్యక్ష ప్రమేయం..: ల్యాండ్‌ పూలింగ్‌ వ్యవహారం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరిగింది. ప్రభుత్వం నుంచి జీవో విడుదలకు సిద్ధమవగానే వుడా ఇక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టేసింది. టీడీపీ ప్రజాప్రతినిధులకు చెందిన వ్యక్తులు రైతుల వద్దకు వెళ్లి వారిని బెదిరించి వందల కొద్దీ ఎకరాలను సేకరించారు. ఈలోగా వుడా బోర్డు సమావేశమై ల్యాండ్‌ పూలింగ్‌ నిర్ణయాలు తీసుకుంది. సీఎం కార్యాలయం నుంచే తాము ఈ ప్రతిపాదనలు తీసుకు న్నామని, ఆ మేరకే నిర్ణయాలు చేస్తున్నామని వుడా తన బోర్డు నిర్ణయాల్లో స్పష్టంగా పేర్కొంది. ఆ నిర్ణయాన్ని అమోదిస్తూ ఆ తర్వాత ప్రభుత్వం జీవో 290 జారీ చేసింది.

సీఎం విశాఖలో ఉండగానే భూ రికార్డులు గల్లంతు..:  2017  ఫిబ్రవరిలో ల్యాండ్‌ పూలింగ్‌ కుంభకోణం బయటపడగానే మే నెలలో రికార్డులు మాయం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లక్ష ఎకరాల భూ రికార్డులు కనిపించడం లేదని స్వయంగా అప్పటి కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించారు. విశాఖలో 2,45,896 ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్స్‌ (ఎఫ్‌ఎంబీ) ఉండగా లక్ష ఎకరాలకు చెందిన 16,375 ఎఫ్‌ఎంబీలు కనిపించకుండా పోయాయి. 3,022 రీ సెటిల్‌మెంట్‌ రిజిష్టర్స్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌)లు ఉండగా 275 అదృశ్యమయ్యాయి. 3,022 గ్రామాలకు సంబంధించి క్లియర్‌ మ్యాపుల్లో 233 గ్రామాల మ్యాపులు కనిపించకుండా పోయాయి. ఇందులో చాలావరకు భీమిలి, మధురవాడ ప్రాంతాల్లోని భూములకు సంబంధించినవే ఉన్నాయి. అయితే, ఇవన్నీ హుద్‌హుద్‌ తుపానులో కొట్టుకుపోయాయని కలెక్టర్‌ చెప్పుకొచ్చారు. 2014 అక్టోబరు 12న విశాఖను అతలాకుతలం చేసిన హుద్‌హుద్‌ తుపానులో ఎక్కడా తహసీల్దార్‌ కార్యాలయాలు కూలినట్లుగా లేదా కొట్టుకుపోయినట్లుగా, ధ్వంసమైనట్లుగా రికార్డు కాలేదు. ఇక సీఎం చంద్రబాబు కూడా ఆ çసమయంలో విశాఖలోనే మకాం వేశారు. ఏకంగా కలెక్టరేట్‌లోనే బస చేశారు. ఇదే సమయంలో రికార్డులు పోయాయని చెప్పడం గమనించాల్సిన విషయం. భూ కుంభకోణాలపై రెండేళ్ల కిందట ‘సాక్షి’లో వరుసగా పరిశోధనాత్మక కథనాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు హడావుడిగా రికార్డులు పోయాయని ప్రకటించారు. విశాఖ జిల్లా టీడీపీలో ప్రస్తుతం కీలకంగా ఉన్న నేతలు భూ దందాల ఆరోపణలు ఎదుర్కొన్నవారే. మంత్రి గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్,  బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్‌లపై భూ దందాల ఆరోపణలు వెల్లువెత్తాయి. గోవింద్‌ పైనేతే ఏకంగా పోలీసు కేసు కూడా నమోదైంది.

అధికారులే సమిధలు..:  భూ కుంభకోణంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఎఎస్‌లపై చర్యలకు సిట్‌ సిఫార్సు చేసినా పట్టించుకోని సర్కారు తహసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులను బలి చేసేసింది. తహసీల్దార్‌ నుంచి స్పెషల్‌ డెప్యుటీ కలెక్టర్లు, ఐఏఎస్‌ స్థాయి అధికారులకు సంబంధించి సుమారు 48 మందిపై క్రిమినల్‌ కేసుల నమోదుకు సిఫార్సు చేసింది. సుమారు 140 మంది వివిధ స్థాయి అధికారులు, సిబ్బందిపై శాఖాపర చర్యలకు సిఫార్సు చేసింది.

భీమిలి నుంచి పరారైన గంటా, పరుచూరి
ఐదేళ్ల కాలంలో భీమిలిలో విలువైన భూములను చెరబట్టారని ఆరోపణలు ఎదుర్కొన్న గంటా శ్రీనివాసరావు, పరుచూరి భాస్కరరావు ఎన్నికలొచ్చేసరికి మొహం చూపించలేక పరారయ్యారు. గంటా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫునే పోటీ చేస్తుండగా, పరుచూరి జనసేన అభ్యర్ధిగా అనకాపల్లి నుంచి బరిలో దిగారు. వీరిద్దరి పోటీ అటు టీడీపీ, జనసేన రహస్య పొత్తును బట్టబయలు చేస్తుండటంతో పాటు భీమిలి నుంచి పరారైనట్లు స్పష్టం చేస్తోందని అంటున్నారు.

సిట్‌ నివేదిను నొక్కిపెట్టేసిన సర్కారు
విశాఖ భూ కుంభకోణంపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఆందోళనకు దిగొచ్చిన సర్కారు 2017 జూన్‌ 20న సిట్‌ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.సృజన సభ్యురాలిగా ఉన్న సిట్‌కు 2,875 ఫిర్యాదులు అందాయి. వీటిలో మూడొంతులు అధికార పార్టీకి చెందిన నేతలపైనే వచ్చాయి. స్వయంగా మంత్రి గంటాపైనే మరో మంత్రి అయ్యన్న, టీడీపీ నేతలు సిట్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇక వివిధ వర్గాల ప్రజలు, భూ బాధితులు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల భూకబ్జాల పైనే సిట్‌కు ఫిర్యాదులు చేశారు. సుదీర్ఘంగా సాగిన సిట్‌ విచారణలో వందల డాక్యుమెంట్లు, వేలాది భూ రికార్డులను పరిశోధించి 2018 జనవరి 29న తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా తొక్కిపెట్టిన సర్కారు చివరికి అదే ఏడాది నవంబర్‌ 6న కేబినెట్‌కు ముందుకు తీసుకొచ్చింది. కానీ నేటికీ బహిర్గతం చేయకపోవడం గమనార్హం.  సిట్‌ నివేదికను బయటపెడితే మొత్తం అందరి చిట్టా విప్పుతానని జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు బెదిరింపులకు దిగారు. దీంతో లోకేష్‌ సహా సర్కారు పెద్దల బండారం బయటపడుతుందని తెలిసి తొక్కిపెట్టారని విశాఖ టీడీపీ వర్గాల వ్యాఖ్య.

లోకేశ్‌నుకలిశాకే ల్యాండ్‌పూలింగ్‌
విశాఖ నగర శివారులో ఆర్థిక నగరాలు నిర్మిస్తామని, పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని ఇందుకోసం అసైన్డ్, ఖాళీగా ఉన్న భూములను వుడా సేకరించి ఏపీ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టిడ్కో)కు అప్పజెబితే ఇళ్ల నిర్మాణం చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆనందపురం మండలం భీమన్నదొర పాలెంలో ఇండస్ట్రియల్‌ పార్కుకు 300 ఎకరాలు, పాలవలసలో 150 ఎకరాల డీ పట్టా, ప్రభుత్వ భూములను సేకరించాలని నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇళ్ల నిర్మాణానికి పెందుర్తి మండలం సౌభాగ్యపురంలో 120 ఎకరాలు, ఆనందపురం మండలం దర్బంధలో 114, విశాఖ రూరల్‌ మండలం కొమ్మాదిలో 116, భీమిలి మండలం నేరెళ్లవలసలో 114, ఆనందపురంలోని గండిగుండంలో 69, రామవరంలో 300 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొంది. వాస్తవానికి  అంతకుముందే మంత్రి గంటా, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుచరులు ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఆ భూములు ఇస్తామంటూ రైతుల రూపంలో దరఖాస్తు చేసి లోకేష్‌ను కలిశారు. తమ భూములను ల్యాండ్‌ పూలింగ్‌కు ఇస్తామని, దీనికి జీవో కావాలని కోరారు. ఈ జీవో వచ్చేలోగానే డీ పట్టా, అసైన్డ్‌ భూములను ఇబ్బడిముబ్బడిగా కొనుగోలు చేశారు. ఎకరా రూ.కోటి విలువైన భూములను... రైతులకు కేవలం రూ.10 లక్షలిచ్చి తమ ఖాతాలో వేసుకున్నారు. దాదాపుగా భీమిలి నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, అసైన్డ్, డీ పట్టా భూములను ఇలా గుప్పిట పట్టారు. పెందుర్తి నియోజకవర్గంలోని ముదపాక ప్రాంతంలో రామరాజు అనే వ్యక్తి నేరుగా కంపెనీ పేరు మీద రైతులకు చెక్కులు ఇచ్చాడు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  బండారు సత్యనారాయణమూర్తికి దీంట్లో మామూళ్లు ముట్టాయనేది రైతులు బహిరంగంగా చెప్పే వాస్తవం. ఇదంతా పక్కాగా అయిన తర్వాత సర్కారు నుంచి ల్యాండ్‌ పూలింగ్‌కు సంబంధించిన జీవో 304 జారీ చేయించారు. ఆ తర్వాతే అసలు విషయం రైతులకు అర్థమైంది. వారంతా భూములను తమకు తిరిగిచ్చేయాలని పోరాడినా పట్టించుకునేవారే లేకపోయారు. బినామీలతో రైతుల నుంచి మంత్రి వర్గీయులు కొనుగోలు చేసిన అసైన్డ్‌ భూమి 358.47 ఎకరాలు, ల్యాండ్‌ పూలింగ్‌కు ప్రతిపాదించి న ఈ భూముల్లో చదరపు గజం ధర కనిష్టంగా రూ.15 వేలుంది. ఈ లెక్కన రైతుల నుంచి మంత్రి అనుచరులు ఎకరాకు తీసుకున్న 1210 చదరపు గజాల స్థలం విలువ రూ.1.80 కోట్లు. 358 ఎకరాల లెక్క వేస్తే రూ.644 కోట్ల పైనే. కానీ రైతులకు దళారుల ద్వారా అందిన మొత్తం రూ.40 కోట్లకు మించదు. అంటే మంత్రి అనుచరులు, సంబంధీకులు దోచుకున్నది సుమారు రూ.600 కోట్లు.

కలెక్టర్‌ స్వయంగా ప్రకటించిన మేరకు గల్లంతైన రికార్డుల వివరాలు

తనఖాతో రుణాలు, ఎగవేతలుగంటా బంధువు పచ్చి దగా
విశాఖ భూ కుంభకోణంలో ఇది మరో కోణం. అది సాగిన క్రమం ఇలా... రుణాలు చెల్లించనివారి ఆస్తులను వేలం వేయడానికి బ్యాంకులు నోటిఫికేషన్లు జారీ చేశాయి. తీరా వేలం దగ్గరకి వచ్చేసరికి వాటిలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. మంత్రి గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తుల వేలంలోనూ ఇలాంటి బాగోతమే వెలుగులోకి వచ్చింది. ఆ కంపెనీ డైరెక్టర్, గంటా బంధువు పరుచూరి వెంకట భాస్కరరావు పేర్కొన్న భూముల్లో ప్రభుత్వానికి చెందినవీ ఉన్నాయి. భాస్కరరావు రుణం కోసం ఇండియన్‌ బ్యాంకుకు కుదువపెట్టిన ఆస్తుల్లో ఆనందపురం మండలం వేములవలస గ్రామం సర్వే నం.122–11లో 726 చదరపు గజాలు, సర్వే నం.122–8, 9, 10, 11, 12, 13, 14, 15లలో 4.33 ఎకరాలు, సర్వే నం.124–1,2,3,4లో 0.271 ఎకరాల భూమి భాస్కరరావు కుదవపెట్టిన వాటిలో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా సర్వే నం.122/9ను పరిశీలిస్తే ఇందులోని 59 సెంట్ల భూమిని జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌) విస్తరణకు ప్రభుత్వమే సేకరించింది. ప్రభుత్వం తీసుకోవడానికి ముందు కేవలం 7 సెంట్ల భూమి మాత్రమే భాస్కరరావు పేరిట నమోదై ఉంది. మిగిలినది తరాలుగా ప్రభుత్వ భూమే. ఇక సర్వే నం.122/10లో 47 సెంట్ల జిరాయితీ భూమిని ఎన్‌హెచ్‌ విస్తరణకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక్కడా భాస్కరరావు పేరిట గజం కూడా లేదు..

సర్వే నం.122–11లో 66 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో 60 సెంట్లు కోరాడ అచ్చమ్మ ఆక్రమణలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన ఆరు సెంట్లు ప్రభుత్వ మిగులు భూమి. అచ్చమ్మ 60 సెంట్ల భూమిలో ప్రస్తుతం బలహీన వర్గాల కాలనీ ఉంది. అంటే ఇక్కడా భాస్కరరావు పేరిట భూమి లేదని తెలుస్తోంది
సర్వే నం.122/12లో 1.04 ఎకరాల భూమిలో భాస్కరరావు పేరిట 30 సెంట్ల భూమి నమోదై ఉంది. మిగిలినది ప్రభుత్వానిది. భాస్కరరావుకు చెందిన 30 సెంట్లలో 8 సెంట్లు ఎన్‌హెచ్‌ విస్తరణకు ప్రభుత్వం సేకరించిన దాంట్లో ఉంది. కానీ, ఇక్కడ ఉన్న 1.04 ఎకరాలను కూడా తనదిగానే బ్యాంకుకు కుదవపెట్టారు. ఇలా తనవి కాని భూములనే కాదు, ప్రభుత్వం సేకరించిన భూములనూ గ్యారంటీ కింద బ్యాంకుల్లో కుదవపెట్టి రూ.కోట్ల రుణం పొందారు.
విచిత్రమేమిటంటే ఎన్‌హెచ్‌ విస్తరణ కోసం భూ సేకరణ చేసిన సంవత్సరం 2003. ప్రత్యూష కంపెనీ ఏర్పడిన సంవత్సరం 2005. రుణం పొందిన సంవత్సరం 2006. అంటే 2003 భూ సేకరణలో కోల్పోయిన భూములను 2006లో రుణం కోసం కుదువపెట్టిన ఆస్తుల్లో చూపారు.

ఎఫ్‌ఎంబీలు16,375
సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌సర్వే (ఎస్‌ఎఫ్‌ఎస్‌)2,95,044
మొత్తం అన్యాక్రాంతమైనభూమి (ఎకరాల్లో)1,06,239.9
విలేజ్‌మ్యాప్‌లు233
రీ సెటిల్‌మెంట్‌ రిజిష్టర్లు275
విలువ:రూ.లక్ష కోట్లు

పట్టా భూమి లాగేసుకున్నారు..
మాది సబ్బవరం. వంగలి రెవెన్యూ పరిధిలో నిర్మించ తలపెట్టిన పెట్రో యూనివర్సిటీ కోసం అంటూ సేకరించినదాంట్లో సర్వే నం.135లో నాది రెండు ఎకరాల భూమి ఉంది. 35 ఏళ్ల క్రితమే దీనికి ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. ఇదే భూమిలో ఉద్యాన పంటలతో ఆరుగురు సభ్యులున్న మా కుటుంబం జీవనం సాగిస్తోంది. ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా కనీసం సమాచారం కూడా లేకుండా భూమిని సేకరించింది. మా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. దీంతో కోర్టును ఆశ్రయించా. భూమి పోయినా కనీసం పరిహారమైనా ఇవ్వాలని కోరుతున్నా.–గవర రామునాయుడు

పంట భూములను తీసుకున్నారు
వంగలి సర్వే నెంబర్‌ 135లో మాది సుమారు 2.87 ఎకరాల భూమి పోయింది. దీనిని చాలా కాలంగా సాగు చేసుకుంటుండటంతో మాకు ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. దీనిపై ఆధారపడి 8 మంది కుటుంబ సభ్యులం బతుకుతున్నాం. ఏటా వరితో పాటు ఉద్యాన పంటలైన ఉల్లి, టమాట, బీర, బెండ పండిస్తాం. ప్రభుత్వం అన్యాయంగా మా భూమి లాక్కుంది. దీంతో కోర్టును ఆశ్రయించాం. కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.–కందా ముత్యాలమ్మ, వంగలి

ప్రజలారా?ఇప్పుడు చెప్పండి?
సరిగ్గా ఐదేళ్ల క్రితం... గత ఎన్నికల ముందు టీడీపీ, ఎల్లో మీడియా ఏమని ప్రచారం చేశాయో గుర్తుందా? ప్రశాంతమైన విశాఖపట్నానికి గూండాలు వస్తారని, వారి ఆగడాలు తట్టుకోలేమని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తారని దుష్ప్రచారం సాగించారు. దీనిని పొరపాటున అప్పట్లో జనం నమ్మి... టీడీపీని గెలిపిం చారు. కానీ, హద్దూ అదుపు లేని అధికార పార్టీ నేతల ఆగడాలతో వాస్తవం తర్వాత తెలిసింది. కనిపించిన భూములన్నీ స్వాహాకు దిగిన పచ్చ దండు తమను ఎన్నుకున్న ప్రజలను వెక్కిరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement