
సాక్షి, నందిగామ : కృష్ణా జిల్లా నందిగామలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రైతు సమస్యలపై మార్కెట్ యార్డు అధికారులతో మాట్లాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై వాగ్వివాదానికి దిగి, గొడవ పడ్డారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన రైతులు తెచ్చిన సుబాబుల్ కొనుగోలు చెయడానికి మార్కెట్ యార్డులోని అధికారులు నిరాకరించారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు మార్కెట్ యార్డు వద్ద రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. అయినా లాభం లేకపోవడంతో మార్కెట్ యర్డ్‌లోని సుబాబుల్‌ని రైతులు జగ్గయ్య పేటకు తీసుకెళ్లాలని భావించారు. ట్రాక్టర్లలో సుబాబుల్‌ని తరలిస్తుండగా నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రైవేటు సిబ్బంది వారిని అడ్డుకున్నారు.
రైతులు సుబాబుల్ తరలిస్తున్న ట్రాక్టర్లను నిలిపివేసిన అధికారులు వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడుతుండగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ నాయకులపై మార్కెట్ యార్డు చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు వర్గీయులు మాటల యుద్ధానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. రైతులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ సీపీ నేతలు స్టేషన్ బయట ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment