స్వర్ణముఖి.. శబరి.. పెన్నా.. నది ఏదైనా..! | TDP Leaders Sand Mafia In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

స్వర్ణముఖి.. శబరి.. పెన్నా.. నది ఏదైనా..!

Published Sun, Mar 24 2019 8:26 AM | Last Updated on Sun, Mar 24 2019 12:53 PM

TDP Leaders Sand Mafia In Andhra Pradesh - Sakshi

విజయవాడ మద్దూరు కృష్ణా నది పాయలో వందలాది ట్రాక్టర్లతో ఇసుక యథేచ్ఛగా ఇసుక దోపిడీ..

ఉచితమంటూనే అధికారమే అండగా పేట్రేగిపోయింది ఇసుక మాఫియా..  ట్రాక్టర్లు.. లారీలు.. టిప్పర్లు.. బుల్‌డోజర్లు.. భారీ క్రేన్లతో నదులన్నీ గనులయ్యాయి..  ఇసుకాసురుల వేటుకు కృష్ణమ్మ విలవిల్లాడింది..  నిలువెల్లా గాయాలతో గోదారమ్మ కంటనీరెట్టింది..  తూట్లు తూట్లు పడి తుంగభద్రమ్మ ఉక్కిరిబిక్కిరైంది..  స్వర్ణముఖి.. శబరి.. పెన్నా.. వంశధార.. నాగావళి.. చిత్రావతి.. నది ఏదైనా ఆనవాళ్లు కోల్పోయింది..  నిత్యం వేలాది వాహనాలు రయ్‌..రయ్‌.. మంటూ దూసుకెళ్తుంటే గ్రామసీమలు వణికిపోతున్నాయి..  అధికారులు కళ్లప్పగించి చూడటం మినహా ఏమీ చేయలేకపోతున్నారు..  ఇదేమని ప్రశ్నించాలనుకున్నా.. తహసీల్దార్‌ వనజాక్షి ఘటన గుర్తొచ్చి మిన్నకుండిపోతున్నారు.. వేల కోట్ల సంపదనంతా పచ్చ నేతలు దోచుకెళ్తుంటే ఏమైపోతోందీ రాష్ట్రం?  

రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకల్లో అధికార పార్టీ నేతల ఇసుక దోపిడి యథేచ్ఛగా సాగుతోంది. నిత్యం వందలాది లారీల ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు తరలిపోతోంది. కళ్లెదుట ఇసుక అక్రమ రవాణా వాహనాలు శరవేగంగా దూసుకుపోతున్నా.. అడ్డుకోలేని నిస్సహాయస్థితి అధికారులది. ఒక్క ఇసుక ద్వారానే గత ఐదేళ్లుగా టీడీపీ నాయకులు దోచుకున్న మొత్తం అక్షరాలా రూ.12,500 కోట్లు దాటిందని అంచనా. అధికార టీడీపీ నాయకులు అడ్డూఅదుపు లేకుండా ఇసుకను తవ్వేస్తుండటంతో.. భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగు, తాగునీరు లేక ప్రజలు.. మత్స్య సంపద తరిగిపోయి మత్స్యకారుల పరిస్థితి దారుణంగా మారింది. గోదావరి, కృష్ణా, నాగావళి, వంశధార,  తుంగభద్ర, పెన్నా, చిత్రావతి నదులు ఇసుక అక్రమ తవ్వకాలతో గుంతలు తేలాయి. రాష్ట్రంలో అయిదేళ్లుగా ఇసుకాసుర పాలన సాగుతోందనడానికి  ప్రత్యక్ష నిదర్శనాలివి.. 
-సాక్షి ప్రతినిధి, అమరావతి

రాష్ట్రంలోని 500పైగా అధికారిక, అనధికారిక ఇసుక రేవులను టీడీపీ నాయకులు తమ దోపిడీకి కేంద్రాలుగా మార్చుకున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే..పాలకుల అండతో అక్రమార్కులు ఎంతటికైనా బరితెగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఇలా ప్రశ్నించిన పాపానికి బాధితులను పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే ఇసుక ట్రాక్టర్లతో తొక్కించి చంపించారు. ఇసుక అక్రమ తవ్వకాన్ని ప్రశ్నించిన మహిళా తహసీల్దారు వనజాక్షిపై దాడిచేసిన ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌కు చంద్రబాబు వత్తాసు పలికారు. పర్మిట్లు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను అధికారులు పట్టుకుంటే.. వాటిని తక్షణమే వదిలేయాలంటూ అనంతపురం జిల్లాలో ఓ మంత్రి హూంకరింపు.. రేయింబవళ్లు ఇసుక తవ్వకం, రవాణా కోసం కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది మధ్యలో నాలుగు కిలోమీటర్ల మేర నిబంధనలకు విరుద్ధంగా ఒక మంత్రి రహదారి ఏర్పాటు.. చంద్రబాబు అండ్‌ కో కనుసన్నల్లో రాష్ట్రంలో అయిదేళ్లుగా నిరాటంకంగా టీడీపీ దండు సాగిస్తున్న ఇసుక దోపిడీ, దందాకు ప్రత్యక్ష నిదర్శనాలివి.

శుక్రవారం రాష్ట్ర రాజధానిలో ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ప్రాంతానికి కూతవేటు దూరంలో కృష్ణా నది పాయలో తమ్ముళ్ల ఇసుక దోపిడీకి సజీవ సాక్ష్యం

ఒక్క ఇసుక ద్వారానే టీడీపీ నాయకులు దోచుకున్న మొత్తం అక్షరాలా రూ.12500 కోట్లు దాటిందని అనధికారిక అంచనా.  2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు అండ్‌కో దృష్టి ఇసుకపై పడింది. వెంటనే డ్వాక్రా మహిళలను తెరపైకి తెచ్చారు. డ్వాక్రా సంఘాలకు ఇసుక సరఫరా హక్కులు కల్పించడం ద్వారా.. ఆదాయమార్గం ఏర్పాటు చేస్తామని గొప్పగా చెప్పారు. ఇందుకోసం ఇసుక పాలసీని మార్చేశారు. డ్వాక్రా సంఘాలను ముందు పెట్టి మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తమ బంధువులు,అనుచరులతో ఇసుక దందా నడిపించారు. ఇసుక దోపిడీతో ప్రభుత్వానికి వచ్చిన చెడ్డపేరును తొలగించుకోవడం.. టీడీపీ నాయకులకు నిరంతర ఆదాయం కల్పించడమే లక్ష్యంగా డ్వాక్రా సంఘాలను తప్పించి.. ఉచిత ఇసుక విధానం తెరపైకి తెచ్చారు. 

ఇసుక అక్రమాలు నిజమే.. 
మంత్రివర్గ ఉపసంఘం మాట ఇది రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా వాస్తవమేనని.. మంత్రివర్గ ఉపసంఘం బహిరంగంగానే అంగీకరించింది. ఇసుక లారీలు రాష్ట్ర సరిహద్దులు దాటిపోతున్నా అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ఒప్పుకుంది. ఇసుక విధానంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కేఈ కృష్ణమూర్తి(రెవెన్యూ), చినరాజప్ప(హోం), సుజయ కృష్ణ రంగారావు(భూగర్భ గనులు) ఏడాది క్రితం ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం!! 


ఉండవల్లి సీఎం నివాసం సమీపంలోని పెనుమాక ఇసుక ర్యాంపు వద్ద క్యూ కట్టిన ఇసుక లారీలు
 


విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నం ఫెర్రీలో కృష్ణా నది నుంచి పెద్ద ఎత్తున క్రేన్‌లతో ఇసుక తోడుతున్న అక్రమార్కులు
– సాక్షి, ఫొటోగ్రాఫర్ల బృందం

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/8

పామిడి పెన్నానదిలో ఇసుకను తోడేయడంతో ఏర్పడ్డ భారీ గుంత

2
2/8

తిరుపతి రూరల్‌ మండలం స్వర్ణముఖి నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతలు

3
3/8

కానూరు సమీపంలో అక్రమంగా ఇసుక ఎగుమతులు దిగుమతులు చేస్తున్న అక్రమార్కులు

4
4/8

పెరవలి మండలం ఉసులుమర్ర ర్యాంపు నదీగర్భంలో రాళ్లతో వేసిన బాటలో ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్న దృశ్యం

5
5/8

శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామంలో పెన్నా నదిలో ఇసుకను తోడేస్తున్న కూలీలు

6
6/8

చోడవరం సమీపంలో ఇసుక తవ్వకాలు

7
7/8

తూ.గోదావరి.. రాజమహేంద్రవరం గోదావరి మధ్యలో

8
8/8

వైఎస్సార్‌ జిల్లా.. ప్రొద్దుటూరు: పెన్నారివర్‌ ర్యాంపులో అక్రమ ఇసుక తవ్వకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement