పంపిణీ చేసేందుకు తెప్పించిన వాషింగ్‌మెషీన్లు, కుట్టు మిషన్లు , జాకార్డ్ యంత్రాలు
సాక్షి, ఉరవకొండ: ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. తాయిలాలతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ పథకం వేశారు. ఆదరణ పథకం కింద గతంలోనే మంజూరైన పనిముట్లను, మిషన్లను ఇంతకాలం పంపిణీ చేయకుండా అలానే ఉంచుకున్నారు. వాటిని ఎన్నికల తాయిలాలుగా అందించి ఓట్లు రాబట్టుకోవాలని టీడీపీ నేతలు భావించారు. ఇందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి ఉరవకొండలోని వీరశైవ కల్యాణ మంటపం సమీపంలో గల ప్రభుత్వ గోడౌన్‌కు ఒక లారీ వచ్చింది. అందులోంచి కుట్టుమిషన్లు, చేనేత జాకార్డ్ యంత్రాలు, వాషింగ్ మెషిన్లు, ఐరన్‌బాక్సులు, మోటార్లు వంటివి దించుతుండగా వైఎస్సార్‌సీపీ నాయకులు బసవరాజు, నిరంజన్‌గౌడ్, వెంకటేష్, లెనిన్, శంకర్, ప్రభాకర్ లు అడ్డుకున్నారు.
పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన వస్తువులన్నింటిపైనా చంద్రబాబు స్టిక్కర్‌లు కుడా వేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వీటిని గోడౌన్‌లో దింపడం ఏంటని ఎంపీడీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ హనుమంతును ప్రశ్నించారు. తాను ఎంపీడీఓ ఆదేశాల మేరకు వీటిని దింపుతున్నట్లు తెలిపాడు. దీనిపై వెంటనే వైఎస్సార్‌సీపీ నేతలు కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి, ఉరవకొండ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
గోడౌన్ సీజ్
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. అక్రమంగా దింపుతున్న చేనేత జాకార్డ్ యంత్రాలు 46, కుట్టుమిషన్లు 200, ఇస్త్రీ పెట్టెలు 100, వాషింగ్‌మెషిన్లు 200, మోటార్లు 400, ఇతర వస్తువులను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ అధ్వర్యంలో సీజ్ చేశారు. లారీలో ఉన్న చేనేత యంత్రాలను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
చేనేత కార్మికులను మభ్యపెట్టడానికి యంత్రాల పంపిణీ
జిల్లాలో ధర్మవరం తరువాత ఉరవకొండలో అత్యధిక మంది చేనేతపై ఆధార పడి జీవిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేనేత రుణమాఫీ చేయలేక వైఫల్యం చెందడంతో కార్మికులు టీడీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు. వ్యతిరేకత నుంచి బయటపడేందుకు టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ చేనేత కార్మికులకు జాకార్డ్ యంత్రాలు ఇచ్చి తద్వారా ఓట్లు వేయించుకునేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పాటు పట్టణంలోని కొంతమందికి కుట్టుమిషన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు.
కోడ్ ఉల్లంఘనే
బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఆదరణ పనిముట్లను అర్ధరాత్రి పూట దిగుమతి చేసుకోవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుంది. దీంతో ఫిర్యాదు రాగానే గోడౌన్ సీజ్ చేయించి లారీని పోలీసుస్టేషన్‌కు తరలించాం. దీనిపై ఎంపీడీఓ ఫజుల్ రహిమాన్ వివరణ తీసుకుని తదిపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
–శోభా స్వరూపారాణి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment