వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య
కర్నూలు జిల్లా: ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేస్తున్న డ్రామాలు పరాకాష్టకు చేరుకున్నాయని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య ఎద్దేవా చేశారు. కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ..నాలుగేళ్లుగా ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ..సరికొత్త డ్రామాలకు తెరలేపిందని వ్యాఖ్యానించారు. బీజేపీ తో జత కట్టి మోసం చేస్తుంది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు అఖిల పక్ష భేటి పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు.
40 ఏళ్ల అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికీ వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్లమెటు నిరవధిక వాయిదా పడిన వెంటనే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని వెల్లడించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమన్నారు.
చంద్రబాబు, ఆయన కుమారుడు జైలు కెళ్లక తప్పదని జోస్యం చెప్పారు. కాంట్రాక్టర్ల, బ్యాంకుల నుంచి టీడీపీ నేతలు దోచుకుంటున్నారని, టీడీపీ తెలుగు దొంగల పార్టీ అని ధ్వజమెత్తారు. జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. మాట తప్పని నేత జగన్ మోహన్ రెడ్డి అని, నాలుగేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ, ప్రత్యేక హోదా సాధించుకునే విషయంలో గానీ చంద్రబాబు ప్రధాన ముద్దాయని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీడీపీ దొందు దొందేనని అన్నారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా వైఎస్సార్‌సీపీ సిద్ధమేనని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment