నల్లగొండ : పరిషత్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో చిన్నచిన్న ఊళ్లలో ఉన్న ఓటర్లు పక్క గ్రామాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వచ్చేది. దీంతో వారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు వ్యయ, ప్రయాసలకు గురయ్యేవారు. ఓటర్ల ఇబ్బందులను గుర్తించిన ఎన్నికల సంఘం ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో ఏ గ్రామం ఓటర్లు అదే ఊరిలో ఓటు వేసే విధంగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో 400 ఓట్లు ఉన్న గ్రామంలో కూడా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు కానుంది. ఈ నిర్ణయంతో ఓటర్ల ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో జిల్లాలో 31 మండలాల పరిధిలో 31 జెడ్పీటీసీలు, 349 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించి 9,67,912 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 1,930 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే ఎన్నికల్లో 1200 నుంచి 1400 ఓటర్లకు ఒక పీఎస్
గత అసెంబ్లీ ఎన్నికల్లో 1200 నుంచి 1400 ఓటర్ల వరకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో 1,627 పోలింగ్ కేంద్రాలు ఉండేవి. అయితే ఒక గ్రామ పంచాయతీ పరిధిలో రెండుమూడు గూడేలు ఉండేవి.. ఆ గూడేల్లో 300 నుంచి 400 వరకు ఓటర్లు ఉండేవారు. 1200 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో.. గ్రామపంచాయతీల్లోనే ఉండేవి. దీంతో పక్కనున్న గూడేల ఓటర్లు న డుచుకుంటూ వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. అయితే కొంతమంది రా జకీయ పార్టీల నాయకులు ఓటర్ల రవాణా కోసం వాహనాలను ఏర్పాటు చేసే వారు. దాన్ని కూడా ఎన్నికల సంఘం అడ్డుకోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ప డ్డారు. కొందరు పక్క గ్రామానికి వెళ్లలేక ఓటు హక్కునుకూడా వినియోగించుకోలేదు.
ఎంపీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్‌స్టేషన్లు..
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం పోలింగ్‌కేంద్రాల సంఖ్యను పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పడిన ఇబ్బందులను గుర్తించిన ఎన్నికల సంఘం 1000 నుంచి 1200 ఓటర్లకు ఒక పోలింగ్‌కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,990కి చేరింది.
పరిషత్ ఎన్నికల్లో 400 ఓటర్లకు పోలింగ్‌స్టేషన్..
ఓటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సంకల్పిం చిన ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికల్లో 400 మంది ఓటర్లు ఉన్నా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రతి గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటైనట్ల య్యింది అంటే 200 నుంచి 400 ఓటర్ల వరకు ఉన్న ప్రతి గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తక్కువ ఓటర్లు ఉన్న గ్రామాలు జిల్లాలో 305 ఉన్నాయి. ఆ గ్రామాల్లో ప్రస్తుతం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఏ గ్రామంలో ఉన్న ఓటర్లు ఆ గ్రామంలోనే ఓటు వేసుకునేందుకు వెసులుబాటు కలిగింది.
ఉదాహరణకు నల్లగొండ నియోజకవర్గంలోని నల్లగొండ మండలం రెడ్డికాలనీకి చెందిన ఓటర్లు గత ఎన్నికల్లో బట్టపోతులగూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కనగల్ మండలంలోని కుమ్మరిగూడెం ఓటర్లు అమ్మగూడెంలో, చెల్లాయిగూడెం ఓటర్లు కనగల్‌లో, తిప్పర్తి మండలంలోని బండ్లోరిగూడెం ఓటర్లు జొన్నగడ్డలగూడెంలో, సర్వాయిగూడెం ఓటర్లు గొల్లగూడంలో ఓటు వేసేవారు. ప్రస్తుతం అన్ని గ్రామాల్లోనూ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వారి ఇబ్బందులు తొలగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment