సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నేతలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్యంగా నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే ఊపును భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. దీనికి కేంద్రం నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తోంది.
బీజేపీ ఇటీవల చేపట్టిన సభ్యుత్వ నమోదు కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొన్న విషయం తెలిసిందే. తెలంగాణలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో.. అమిత్ షా మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన పర్యటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌లో జరిపే సభకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో పాటు సీనియర్లు కూడా ఆహ్వానించామని వివరించారు. ఈ సభలో టీడీపీ ఎంపీ గరికపాటి రామ్మోహన్‌తో పాటు 20మంది నేతల వరకు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment