
సాక్షి, న్యూఢిల్లీ: రెండు విడతలుగా 75 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు మల్ల గుల్లాలు పడుతోంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం ఎట్టకేలకు మరొక జాబితా సిద్ధం చేసింది. తాము 12 స్థానాల్లో పోటీ చేయనున్నామంటూ తెలంగాణ జన సమితి ప్రకటించడంతో కాంగ్రెస్ ఒత్తిడిలో పడింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి. కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్ సమావేశ మయ్యారు. ఇప్పటికే ఎంపిక చేసిన అభ్యర్థులతో కూడిన జాబితాను మరోసారి సమీక్షించారు. ఈ సమావేశంలో 14 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మిత్ర పక్షాలు కోరుతున్న జన గామ, సనత్‌నగర్ తదితర స్థానాల్లో ఆశా వహులైన పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులకు కుంతియా ఫోన్ చేశారని తెలిపాయి. వీరిని బుజ్జగించే బాధ్యతను కోర్ కమిటీ సభ్యుడు అహ్మద్ పటేల్‌కు అప్పగించినట్టు వివరించాయి. కాంగ్రెస్ తుది అభ్యర్థుల జాబితాను శనివారం ప్రకటించనున్నట్లు పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి. కుంతియా తెలిపారు. బీసీలకు టీఆర్‌ఎస్ కంటే తామే ఎక్కువ సీట్లు ఇస్తామని స్పష్టంచేశారు. ఇప్పటివరకు బీసీలకు 15 సీట్లు ఇచ్చామని, తుది జాబితాలో మరో ఏడు సీట్లు కేటాయిస్తామని వివరించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణ లపై రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. మల్లేశం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని పీసీసీని ఏఐసీసీ ఆదేశించింది.
రాహుల్‌ను కలిసిన పొన్నాల, పొంగులేటి...
మధ్యాహ్న భోజన విరామ సమయంలో రాహుల్‌గాంధీని తానూ, పొన్నాల లక్ష్మయ్య కలిసినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఖమ్మం స్థానాన్ని ఆశిస్తున్న ఆయన.. ఆ స్థానాన్ని టీడీపీకి అప్పగించడం పార్టీకి నష్టదాయకమైన చర్య అని వివరించినట్టు తెలిపారు. ‘‘నా జీవితకాలాన్ని పార్టీ సేవకు వినియోగించినప్పటికీ, ప్రతిసారీ ఏదో ఒక నెపంతో అన్యాయం చేశారని వివరించాను. పొన్నాల లక్ష్మయ్య 35 ఏళ్లపాటు ఒకే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే, ఇప్పుడు ఈ స్థానాన్ని మిత్రపక్షాలకు కట్టబెడుతున్నారంటూ వస్తున్న వార్తలు ఆయన్ను కలవరపరుస్తున్నాయని చెప్పాను. దీనిపై కుంతియా అనుమతితో కోదండరామ్‌తో సంప్రదింపులు జరపాలని రాహుల్ సూచించారు. దీంతో కోదండరామ్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం’’అని పొంగులేటి తెలిపారు.
నిరసనల హోరు...
టికెట్ ఆశించి భంగపడిన నేతలు హస్తినలో నిరసనలు నిర్వహించారు. హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి.. రాహుల్ నివాసం ముందు ధర్నా చేశారు. ఓబీసీ కన్వీనర్ చిత్తరంజన్‌దాస్ తెలంగాణ భవన్‌లో దీక్ష నిర్వహించారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని, బీసీలకు 40 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాగా, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. అయితే, తాను రాహుల్‌ను కలవలేదని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment