ఎనిమిది చోట్ల ఖరారుపై తకరారు!  | Sakshi
Sakshi News home page

ఎనిమిది చోట్ల ఖరారుపై తకరారు! 

Published Mon, Mar 25 2024 3:22 AM

Congress Lok Sabha candidates list in telangana - Sakshi

ఆదిలాబాద్‌
ఈ లోక్‌సభ సీటులో స్థానిక నేతలు కాకుండా బయటి నుంచి తెచ్చిన వారిని పోటీలో పెట్టాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన రమేశ్‌ రాథోడ్‌ ఇప్పుడు పార్టీలో లేరు. అంతకంటే ముందు పోటీచేసిన డాక్టర్‌ నరేశ్‌ జాదవ్‌ పార్టీలోనే ఉన్నా వేరే అభ్యర్థి కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో రిమ్స్‌లో వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్‌ సుమలత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణలలో ఒకరిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. వీరిలో సుమలత పేరు ఖరారైందని తొలుత ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఆత్రం సుగుణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  

వరంగల్‌ 
ఈ ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గంలో కచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రకటించిన రెండు ఎస్సీ రిజర్వుడ్‌ సీట్లను మాల సామాజిక వర్గానికే ఇచ్చారు. దీంతో ఇక్కడ మాదిగ సామాజికవర్గ నేతకే చాన్స్‌ ఇవ్వనున్నారు. తొలుత దొమ్మాట సాంబయ్య పేరు ప్రముఖంగా వినిపించింది. తర్వాత బీఆర్‌ఎస్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ పార్టీలోకి రావడంతో ఆయన వైపు మొగ్గు కనిపిస్తోందని అంటున్నారు. ఈ ఇద్దరితోపాటు గతంలో లోక్‌సభకు పోటీచేసిన డాక్టర్‌ రాగమళ్ల పరమేశ్వర్‌ కూడా టికెట్‌ అడుగుతున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థిని తేల్చడంలో గందరగోళం కనిపిస్తోంది. 

 కరీంనగర్‌ :
ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అలిగి ప్రవీణ్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. వెలిచాల రాజేందర్‌రావు పేరు కూడా వినిపిస్తోంది. ఇక్కడ ప్రవీణ్‌రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని అంటున్నా అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు.

నిజామాబాద్‌
స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పోటీ చేస్తారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. బాల్కొండ నుంచి అసెంబ్లీకి పోటీచేసిన ముత్యాల సునీల్‌రెడ్డి కూడా ఎంపీ టికెట్‌ అడుగుతున్నారు. ఇక్కడ జీవన్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైందని చెప్తున్నా అధికారికంగా ప్రకటించలేదు. 

ఖమ్మం: 
ఈ ఎంపీ సీటు ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులలో ఎవరికి అవకాశం అన్నదానిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. మల్లు నందిని, పొంగులేటి ప్రసాదరెడ్డి, తుమ్మల యుగంధర్‌లతోపాటు పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు కూడా ఖమ్మం టికెట్‌ అడుగుతున్నారు. మంత్రుల కుటుంబ సభ్యులకు అవకాశమిస్తారా? కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తారా? బీసీ వర్గాలకు టికెట్‌ ఇస్తారా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. 

భువనగిరి: 
ఇక్కడ కూడా ఖమ్మం లోక్‌సభ స్థాయిలో పోటీ నెలకొంది. ఈ సీటుకు సంబంధించి తొలినుంచీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. తర్వాత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి పేరును సీరియస్‌గా పరిశీలించారు. అయితే రాజగోపాల్‌రెడ్డి మాత్రం తాము టికెట్‌ అడగడం లేదని, లోక్‌సభ ఎన్నికల తర్వాత తాను మంత్రిని అవుతానని అంటున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పార్టీలోకి వస్తారని, ఆయనకే టికెట్‌ ఇస్తారనే ప్రచారం జరిగినా అది ఆచరణలోకి రాలేదు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన మరో నాయకుడు పవన్‌రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. తాజాగా బీసీ నేతకు భువనగిరి టికెట్‌ వస్తుందనే చర్చ జరుగుతోంది. దీనితో గందరగోళంగా మారింది. 

మెదక్‌:  
ఈ లోక్‌సభ సీటును బీసీలకు ఇస్తారని మొదట్నుంచీ ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరి, పటాన్‌చెరు టికెట్‌ ఇవ్వకపోవడంతో బీఎస్పీ తరఫున పోటీచేసి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిన నీలం మధు ముదిరాజ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష కూడా పోటీలో ఉన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల తనకు మెదక్‌ ఎంపీ టికెట్‌ కావాలని అడిగినా.. ఆమెను టీజీఐఐసీ చైర్మన్‌గా నియమించడంతో రేసు నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది. మెదక్‌లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.

హైదరాబాద్‌
హైదరాబాద్‌ టికెట్‌ విషయంలోనూ ఏమీ తేలలేదు. ఇక్కడ ఎంఐఎంకు ప్రతిగా ఎంబీటీని ప్రోత్సహించాలని తొలుత భావించారు. కానీ కాంగ్రెస్‌ అభ్యర్థిని బరిలో దింపాలని తర్వాత నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్‌తోపాటు అలీ మస్కతిల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా న్యాయవాది షహనాజ్‌ తబసుమ్‌ అభ్యర్థిత్వాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఎలాంటి స్పష్టతా లేదు.  

Advertisement
 
Advertisement