
హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడి సామాజిక తెలంగాణను నిర్మించుకునేదిశగా బడుగు, బలహీన వర్గాలు ఏకమై ముందుకు సాగాలని సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ కన్వీనర్ కస్తూరి జయప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారత భవన్‌లో జయప్రసాద్ అధ్యక్షతన సామాజిక తెలంగాణ ఓబీసీ జేఏసీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్‌రావు, తెలంగాణ మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
సుధాకర్, విశ్వేశ్వర్‌రావు, దేవయ్య మాట్లాడుతూ ప్రజాధనంతో ప్రగతిభవన్‌ను నిర్మించుకొని ప్రజలను కలవని ముఖ్యమంత్రి, ప్రజాదర్బార్‌ను నిర్వహించని ముఖ్యమంత్రి కేసీఆర్ అని, నాలుగున్నర సంవత్సరాల్లో ఏనాడూ సచివాలయానికి వెళ్లకపోవడం ఆయన దొరతనానికి నిదర్శనమని అన్నారు. 52 శాతానికిపైగా ఉన్న బీసీలకు టీఆర్‌ఎస్ అధినేత కేవలం 21 సీట్లు కేటాయించి ఈ వర్గాలను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో ముందువరుసలో ఉన్న విద్యార్థులను, నిరుద్యోగులను, కళాకారులను నిర్లక్ష్యం చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. జనాభాలో సగభాగమున్న మహిళలను గౌరవించి రాజకీయ సాధికారత వైపు నడిపించాల్సింది పోయి మంత్రివర్గంలో ఒక్క మహిళను కూడా తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారన్నారు.