
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి జారీ చేసిన రెండో షోకాజ్ నోటీసులపై సమాధానం కోసం మరికొంత కాలం వేచిచూడాలని తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయించింది. ఆయన సమీప బంధువు చనిపోయినందున, నోటీసులపై సకాలంలో స్పందించడం లేదని రాజగోపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణా కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరికొద్ది రోజులు చూశాక అప్పటికీ స్పందన రాకుంటే నిర్ణయం తీసుకోవాలనే భావనలో ఉంది.
పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్‌రెడ్డిని రెండోసారి ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే షోకాజ్‌లపై విధించిన గడువు ముగియడంతో బుధవారం గాంధీభవన్‌లో చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన కమిటీ భేటీ అయింది. కమిటీ కన్వీనర్ శ్యాంమోహన్, సభ్యులు ఎంపీ నంది ఎల్లయ్య, సంభాని చంద్రశేఖర్, సీజే శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి సమీప బంధువు చనిపోయారని, అందుకే సకాలంలో స్పందించలేకపోయారని కుటుంబ సభ్యులు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన సమాచారంపై చర్చించారు. ఈ నేపథ్యంలో మరికొంత కాలం వేచిచూద్దామనే నిర్ధారణకు వచ్చారు. అయితే దీనిపై క్రమశిక్షణా కమిటీ వ్యవహారంలో ఇతరుల జోక్యం ఉండరాదని, ఎవరైనా తమ అభిప్రాయాలను కమిటీ ముందు చెప్పాలని సూచించింది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి తదితరులు ఢిల్లీలో ఉన్నందున రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై వేచిచూడాలని, మళ్లీ ఎలాంటి నోటీసులు ఇవ్వరాదనే భావనతో ఉంది.
ఈ భేటీ అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. నోటీసులు ఇచ్చిన తర్వాత రాజగోపాల్‌రెడ్డి మీడియా ముందుకెళ్లడం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మీడియా ముందు కూడా నోరుజారారని, గోటితో పోయేదాన్ని.. గొడ్డలి దాకా తీసుకురావడం ఎందుకన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి తొందరపడ్డా, కమిటీ తొందరపడదని తెలిపారు. క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వకుండా కూడా చర్యలు తీసుకోవచ్చన్నారు.