
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. తొలుత ఎన్నికల బరిలో నిలబడాలని భావించినా... సీనియర్ నేతలు పార్టీని వీడటం, మరోవైపు ఉన్నవాళ్లు పోటీకి ఆసక్తి చూపకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నిర‍్ణయించింది. ఇటీవలి జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కలిసి మహాకూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ మిత్రపక్షం కాంగ్రెస్ ఇప్పటికే 17 లోక్‌సభ స్థానాలను ప్రకటించేంది. దీంతో ఒంటరిగా బరిలోకి నిలిచే ధైర్యం చేయలేకపోతోంది తెలంగాణ టీడీపీ.
మరోవైపు నామా నాగేశ్వరరావు కోసం ఖమ్మం నుంచి పోటీలో నిలుద్దామని టీడీపీ ముందుగా భావించినా... ఆయన పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడం, మిగిలిన స్థానాలకు కనీసం అభ్యర్థులు దొరకని వైనం నెలకొంది. మొన్నటి అసెంబ్లీ ఫలితాలతో సీనియర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. ఓడిపోయేదానికి అంత ఖర్చు అవసరమా అనే భావనతో ఉన్నారు. దీంతో తెలంగాణ టీడీపీ నాయకత్వం లోక్‌సభ ఎన్నికల పోటీ ఆలోచనను విరమించుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తమకు మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ కుంతియా...తెలంగాణ టీడీపీ నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. అంతేకాకుండా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న టీడీపీ నేతలతో భేటీ అయ్యారు కూడా. ఈ నేపథ్యంలో టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలంగాణలో తాజా పరిణామాలపై చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇచ్చారు. కాంగ్రెస్‌పై మద్దతు ఇచ్చే అంశంపై చర్చించేందుకు టీడీపీ నేతలు ఇవాళ మరోసారి సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment