మెదక్ జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ వేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మార్గం హైమావతి
మెదక్ రూరల్: ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దుర్తి ఆరు మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండో విడతలో ఆరు జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 60 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 362 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఆయా పార్టీలు బీఫాంలను ఇచ్చిన అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించగా, ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నవారికి బ్యాట్, కత్తెర గుర్తులను కేటాయించారు.
బుధవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు తర్వాత 60 ఎంపీటీసీ స్థానాలకు చివరి రోజు 22 నామినేషన్లు ఉపసంహరించున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 26 నుండి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 60 ఎంపీటీసీ స్థానాలకు 454 నామినేషన్లు, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 57 నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతరం రెండేసి చొప్పున వచ్చిన నామినేషన్లను అధికారులు తొలగించగా మొత్తం 382 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 57 నామినేషన్లు వేయగా అందులో రెండేసి చొప్పున ఉన్న నామినేషన్లను తొలగించగా, మొత్తం 47 నామినేషన్లను పరిగణలోకి తీసుకున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు గురువారం నుండి ప్రచారాలను నిర్వహించనున్నారు.
రెండో రోజు నామినేషన్లు ఇవే..
ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం రెండో రోజు జోరుగా కొనసాగింది. ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలకు 18 మంది, 64 ఎంపీటీసీ స్థానాలకు 131 మంది నామినేషన్లను దాఖలు చేశారు. తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ ఎనిమిది మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. ఆయా మండల కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment