మెదక్ రూరల్: మండల అధ్యక్షుల ఎన్నికలు ఈనెల 7న (శుక్రవారం) జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మంగళవారం వెల్లడైన ప్రాదేశిక ఫలితాల్లో 20 మంది జెడ్పీటీసీలు, 189 మంది ఎంపీటీసీలు ఎన్నికయ్యారు. ఇందులోఎంపీటీసీలుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు 118, కాంగ్రెస్ 44, స్వతంత్రులుగా 27 మంది గెలుపొందారు. ఈ నెల 7న కోఆప్షన్ సభ్యుడు, మండల పరిషత్ ఎన్నికను నిర్వహించనున్నారు. కోఆప్షన్ మెంబర్ ఎంపికతో మొదలైన ప్రక్రియ మండల అధ్యక్ష ఎన్నికతో ముగుస్తుంది. ఉదయం 11 గంటల వరకు కోఆప్షన్ మెంబర్ కోసం నామినేషన్ పత్రాన్ని ప్రిసైడింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది.
అనంతరం 10 నుంచి 12 గంటలలోపు స్క్రూటినీ, 12 నుంచి ఒంటిగంట వరకు నామినేషన్ల ఉపసంహరణ నిర్వహిస్తారు. ఆ తర్వాత అర్హత కలిగిన అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుంది. ఏ ఫాంను ఆయా పార్టీల అధ్యక్షులు సంతకం చేసి ఇవ్వగా, బీఫాంను పార్టీలకు సంబంధించిన విప్ జారీ చేయనుంది. స్వతంత్ర అభ్యర్థులు ఓటింగ్‌లో పాల్గొంటారు. నామినేషన్లు ఒకటి కంటే ఎక్కువ వస్తే చేతులు ఎత్తడం ద్వారా ఎంపిక చేస్తారు.
కోఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక కోసం సమావేశం నిర్వహిస్తారు. కోరం సభ్యుల మెజార్టీ మేరకు మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఉంటుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసినట్లు జెడ్పీ సీఈఓ లక్ష్మీబాయి తెలిపారు. జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లోనే ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఉంటుందని చెప్పారు. కొత్తగా ఏర్పాటైన మండలాలకు సంబంధించి ఆయా మండల కేంద్రాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే నిర్వహిస్తారన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంపీడీఓలకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని లక్ష్మీబాయి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment