ఆమె రాజకీయంలో రారాణి. ఐదేళ్లపాటు ఉమ్మడి జిల్లాను శాసించారు. డిగ్రీలు, పీజీలు చేసిన అధికారులు, నాయకులు ఆమె కనుసన్నల్లో పనిచేశారు. ఆమె చదివింది పదో తరగతే. అయినా కృషి పట్టుదల సంకల్ప బలంతో అంచెలంచెలుగా ఎదిగి జిల్లా అత్యున్నత పదవిని చేజిక్కించుకున్నారు. ఆమే ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణిమురళీయాదవ్. ఆమె బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావించిన అంశాలు ఆమె మాటల్లోనే.. ‘‘జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే.. అయినా అందరూ ఉన్నత విద్యనభ్యసించాలి.. అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి.. చదువొక్కటే సక్సెస్‌కు కొలమానం కాదు. పరీక్షలు తప్పితే జీవితంలో ఓడిపోయినట్లు కాదు.
సాక్షి, మెదక్: మాది దౌల్తాబాద్ మండలం కోనా యిపల్లి గ్రామం. అమ్మ సత్తమ్మ, నాన్న నర్సింహ. మేం ముగ్గురం ఆడ పిల్లలం. మాది మధ్యతరగతి కుటుంబం. అప్పటి పరిస్థితులకనుగుణంగా హైదరాబాద్‌లోని రాంగోపాల్‌పేట ప్రాంతంలోని చుట్టాల బస్తీలో స్థిరపడ్డాం. మా నాన్న బట్టల షాపులో పనిచేస్తూ మమ్మల్ని ఎంతో కష్టపడుతూ పోషించేవాడు. అందరం ఆడ పిల్లలమే కావడంతో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండేవి. దీంతో పై చదవులు చదివించే పరిస్థితులు లేకపోవడంతో పదవ తరగతి వరకు చదివి.. ఆపేశాను. ఆ తర్వాత మేన సంబంధం.. పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి తర్వాత నర్సాపూర్‌లో స్థిరపడ్డాం. నా భర్త (మురళీయాదవ్) ప్రోద్బలంతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టా. నేను ఒకసారి సర్పంచ్‌గా పనిచేశాను. నా భర్త రెండు సార్లు సర్పంచ్‌గా పని చేయగా>.. ఎన్నో ఒడిదుడుకులు, సమస్యల మధ్య జీవితం కొనసాగింది. ప్రజల ఆశీస్సులతో ఒక్కో అడుగు ముందుకేశా. ఉన్నత చదువులు చదవకున్నా ఉన్నతమైన స్థానంలో ప్రజలు నన్ను నిలబెట్టారు.
పట్టుదలతో ముందుకు..
వార్డు మెంబర్‌నైనా అవుతానో.. లేదో.. అనే భయం ఉండేది. పదో తరగతి చదివిన నాకు సమావేశాల్లో ఎలా మాట్లాడో తెలిసేది కాదు. కానీ.. పట్టుదలతో ముందుకెళ్లాను. నా సంకల్ప బలమే నన్ను జెడ్పీ పీఠంపై కూర్చోబెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకు.. చేసే పనికి పొంతన లేకుండా పోయింది. నేటి పరిస్థితుల్లో చదువు ముఖ్యమైన అంశమైనప్పటికీ.. అదే జీవితం కాదు.
జీవితాన్ని అనుకూలంగా మార్చుకోవాలి..
‘చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది తప్ప.. చదువే జీవితం కాదు. ఇటీవల కొందరు విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఎంతో విచారకరం. పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడిపోయినట్లు కాదు.. ఉన్న ఒక్క జీవితాన్ని తమకు అనుకూలంగా మల్చుకోవాలి. తమలో ఉన్న ప్రతిభను వెలికితీసి జీవితపు విలువలను తెలుసుకోవాలి. ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన వచ్చే ప్రతీ విద్యార్థి ఒక్క క్షణం జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆవేదన గురించి ఆలోచించాలి. ఎందుకు చెబుతున్నాననంటే (కన్నీరు పెడుతూ).. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న నా కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆత్మహత్య చేసుకోలే.. చేతికొచ్చిన కొడుకును వాడి బర్త్ డే రోజునే రోడ్డు ప్రమాదం కబళించింది. ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. మా నుంచి వాడు దూరమైనా.. మేం వాడికి దూరం కాలేదు.’
అజయ్ పేరిట సేవా కార్యక్రమాలు
కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాకు ప్రజలే అండగా నిలిచారు. వారిచ్చిన ధైర్యంతోనే అజయ్‌యాదవ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతీ ఏడాది విద్యార్థులకు ఉచితంగా గ్రూప్–2 శిక్షణ ఇప్పిస్తున్నాం. 20 లీటర్ల శుద్ధ జలాన్ని రూ.2కే అందజేస్తున్నాం. క్రీడల్లో విద్యార్థుల ప్రతిభా పాటవాలను వెలికితీయడానికి ప్రతీ ఏడాది క్రీడాపోటీలు నిర్వహిస్తున్నాం. పేద విద్యార్థులకు చేయూతనందించడంతోపాటు నిరుపేద మహిళల పెళ్లిళ్లకు పుస్తె, మట్టెలు అందజేస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీయరియల్ అందజేయడం వంటి సేవా కార్యక్రమాలను చేపడుతున్నాం. చివరగా చెబుతున్నది ఏమంటే.. ‘ఏదేమైనా సమçస్యకు ఆత్మహత్యే పరిష్కారం కాదు.. ప్రతీ ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రులు, కుటుంబం గురించి ఆలోచించాలి. తమలోని ప్రతిభను వెలికితీసి ఏ రంగంలో నైపుణ్యం ఉందో తెలుసుకుంటే అందరి జీవితం సుఖశాంతులతో వర్థిల్లుతుంది.
పుట్టెడు శోకంలో..
యాక్సిడెంట్‌లో చేతికొచ్చిన కొడుకును పోగొట్టుకున్నాం. పుట్టెడు శోకంలో బతుకీడుస్తున్నాం. మా జీవితాల్లో చిమ్మ చీకట్లు కమ్ముకున్నా.. ప్రజలిచ్చిన ధైర్యంతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదు. పరీక్షలో ఫెయిలైతే జీవితాన్ని కోల్పోయినట్లు కానే కాదు. ప్రతీ ఒక్కరు తమలో ఉన్న ప్రతిభను గుర్తించి జీవితపు విలువలను తెలుసుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment