Rajamani
-
మహిళా రేషన్ డీలర్ హత్య! వివాహేతర సంబంధమే కారణమా?
కరీంనగర్: మంథనిలోని హనుమాన్‌నగర్‌లో మహిళా రేషన్ డీలర్ హత్య కలకలం రేపింది. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బందెల రాజమణి(37) ఈ నెల 9న రాత్రి హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. బుధవారం ఆటో డ్రైవర్ పైడాకుల సంతోష్ ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. ముత్తారం మండలానికి చెందిన రాజమణికి లక్ష్మీపూర్‌కు చెందిన బందెల రమేశ్‌కు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. రమేశ్ నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. రాజమణి గ్రామంలో రేషన్ డీలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. రేషన్ సరుకులు తెచ్చే సందర్భంలో ఆటో డైవర్ సంతోష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సంతోష్ తరచూ ఇంటికి వచ్చివెళ్లేవాడు. కొంతకాలంగా అతడితో విభేదాలు రావడంతో ఇంటికి రావడం లేదు. ఈక్రమంలో సోమవారం సాయంత్రం సరుకుల కోసం వెళ్తున్నానని రాజమణి ఇంట్లో పిల్లలకు చెప్పి బయలుదేరింది. ఆ రోజు తన చిన్న కూతురుతో ఫోన్లో మాట్లాడింది. కానీ ఇంటికి తిరిగి రాలేదు. తర్వాత పిల్లలు ఫోన్ చేయగా స్పందించలేదు. ఆమె ఆచూకీ కోసం వెతుకుతుండగా మంగళవారం రాత్రి మంథనిలోని ఎరుకల గూడెంలో పైడాకుల సంతోష్ అద్దెకు ఉంటున్న ఇంట్లో మృతిచెంది ఉంది. ఆమె నుదుటిపై, గొంతుపై బలమైన గాయాలున్నాయి. రాజమణిని సంతోష్ వేధించడంతో అతడ్ని తిరస్కరించినందుకు కోపంతో పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతురాలి సోదరుడు కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘రాజ’కీయంగా ‘రాణించా..
ఆమె రాజకీయంలో రారాణి. ఐదేళ్లపాటు ఉమ్మడి జిల్లాను శాసించారు. డిగ్రీలు, పీజీలు చేసిన అధికారులు, నాయకులు ఆమె కనుసన్నల్లో పనిచేశారు. ఆమె చదివింది పదో తరగతే. అయినా కృషి పట్టుదల సంకల్ప బలంతో అంచెలంచెలుగా ఎదిగి జిల్లా అత్యున్నత పదవిని చేజిక్కించుకున్నారు. ఆమే ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ రాజమణిమురళీయాదవ్. ఆమె బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావించిన అంశాలు ఆమె మాటల్లోనే.. ‘‘జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే.. అయినా అందరూ ఉన్నత విద్యనభ్యసించాలి.. అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి.. చదువొక్కటే సక్సెస్‌కు కొలమానం కాదు. పరీక్షలు తప్పితే జీవితంలో ఓడిపోయినట్లు కాదు. సాక్షి, మెదక్: మాది దౌల్తాబాద్ మండలం కోనా యిపల్లి గ్రామం. అమ్మ సత్తమ్మ, నాన్న నర్సింహ. మేం ముగ్గురం ఆడ పిల్లలం. మాది మధ్యతరగతి కుటుంబం. అప్పటి పరిస్థితులకనుగుణంగా హైదరాబాద్‌లోని రాంగోపాల్‌పేట ప్రాంతంలోని చుట్టాల బస్తీలో స్థిరపడ్డాం. మా నాన్న బట్టల షాపులో పనిచేస్తూ మమ్మల్ని ఎంతో కష్టపడుతూ పోషించేవాడు. అందరం ఆడ పిల్లలమే కావడంతో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండేవి. దీంతో పై చదవులు చదివించే పరిస్థితులు లేకపోవడంతో పదవ తరగతి వరకు చదివి.. ఆపేశాను. ఆ తర్వాత మేన సంబంధం.. పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి తర్వాత నర్సాపూర్‌లో స్థిరపడ్డాం. నా భర్త (మురళీయాదవ్) ప్రోద్బలంతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టా. నేను ఒకసారి సర్పంచ్‌గా పనిచేశాను. నా భర్త రెండు సార్లు సర్పంచ్‌గా పని చేయగా>.. ఎన్నో ఒడిదుడుకులు, సమస్యల మధ్య జీవితం కొనసాగింది. ప్రజల ఆశీస్సులతో ఒక్కో అడుగు ముందుకేశా. ఉన్నత చదువులు చదవకున్నా ఉన్నతమైన స్థానంలో ప్రజలు నన్ను నిలబెట్టారు. పట్టుదలతో ముందుకు.. వార్డు మెంబర్నైనా అవుతానో.. లేదో.. అనే భయం ఉండేది. పదో తరగతి చదివిన నాకు సమావేశాల్లో ఎలా మాట్లాడో తెలిసేది కాదు. కానీ.. పట్టుదలతో ముందుకెళ్లాను. నా సంకల్ప బలమే నన్ను జెడ్పీ పీఠంపై కూర్చోబెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో చదువుకు.. చేసే పనికి పొంతన లేకుండా పోయింది. నేటి పరిస్థితుల్లో చదువు ముఖ్యమైన అంశమైనప్పటికీ.. అదే జీవితం కాదు. జీవితాన్ని అనుకూలంగా మార్చుకోవాలి.. ‘చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది తప్ప.. చదువే జీవితం కాదు. ఇటీవల కొందరు విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఎంతో విచారకరం. పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడిపోయినట్లు కాదు.. ఉన్న ఒక్క జీవితాన్ని తమకు అనుకూలంగా మల్చుకోవాలి. తమలో ఉన్న ప్రతిభను వెలికితీసి జీవితపు విలువలను తెలుసుకోవాలి. ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన వచ్చే ప్రతీ విద్యార్థి ఒక్క క్షణం జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆవేదన గురించి ఆలోచించాలి. ఎందుకు చెబుతున్నాననంటే (కన్నీరు పెడుతూ).. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న నా కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆత్మహత్య చేసుకోలే.. చేతికొచ్చిన కొడుకును వాడి బర్త్ డే రోజునే రోడ్డు ప్రమాదం కబళించింది. ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. మా నుంచి వాడు దూరమైనా.. మేం వాడికి దూరం కాలేదు.’ అజయ్ పేరిట సేవా కార్యక్రమాలు కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాకు ప్రజలే అండగా నిలిచారు. వారిచ్చిన ధైర్యంతోనే అజయ్‌యాదవ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతీ ఏడాది విద్యార్థులకు ఉచితంగా గ్రూప్–2 శిక్షణ ఇప్పిస్తున్నాం. 20 లీటర్ల శుద్ధ జలాన్ని రూ.2కే అందజేస్తున్నాం. క్రీడల్లో విద్యార్థుల ప్రతిభా పాటవాలను వెలికితీయడానికి ప్రతీ ఏడాది క్రీడాపోటీలు నిర్వహిస్తున్నాం. పేద విద్యార్థులకు చేయూతనందించడంతోపాటు నిరుపేద మహిళల పెళ్లిళ్లకు పుస్తె, మట్టెలు అందజేస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీయరియల్ అందజేయడం వంటి సేవా కార్యక్రమాలను చేపడుతున్నాం. చివరగా చెబుతున్నది ఏమంటే.. ‘ఏదేమైనా సమçస్యకు ఆత్మహత్యే పరిష్కారం కాదు.. ప్రతీ ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రులు, కుటుంబం గురించి ఆలోచించాలి. తమలోని ప్రతిభను వెలికితీసి ఏ రంగంలో నైపుణ్యం ఉందో తెలుసుకుంటే అందరి జీవితం సుఖశాంతులతో వర్థిల్లుతుంది. పుట్టెడు శోకంలో.. యాక్సిడెంట్లో చేతికొచ్చిన కొడుకును పోగొట్టుకున్నాం. పుట్టెడు శోకంలో బతుకీడుస్తున్నాం. మా జీవితాల్లో చిమ్మ చీకట్లు కమ్ముకున్నా.. ప్రజలిచ్చిన ధైర్యంతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదు. పరీక్షలో ఫెయిలైతే జీవితాన్ని కోల్పోయినట్లు కానే కాదు. ప్రతీ ఒక్కరు తమలో ఉన్న ప్రతిభను గుర్తించి జీవితపు విలువలను తెలుసుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. -
అన్నింటా ఆమె
నేడు మహిళా దినోత్సవం ఆకాశంలో సగం.. సమాజ నిర్మాణంలో మహోన్నతం.. అన్ని రంగాల్లోనూ పాత్ర అమోఘం.. మహిళల కృషి అనిర్వచనీయం.. వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. నూతనంగా మనుగడలోకి వచ్చిన మెతుకుసీమలో మహిళా జనాభా అధికమే. అయితే ఇప్పటికీ చాలా మందికి ప్రతిభ పాటవాలున్నా వెనుకబాటుకు గురవుతున్నారు. రాజకీయరంగంలో మహిళలు రాణిస్తున్నా.. కొందరు భర్తచాటునే ఉంటున్నారు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని మహిళా ప్రజాప్రతినిధులు సాధికారతకు దూరమవుతున్నారు. మరోవైపు మహిళలపై పెరుగుతున్న దాడులు ఆందోళనకరం. జిల్లాలో 51 శాతానికిపైగా ఉన్న మహిళలు జిల్లా సమగ్ర అభివృద్ధి, సమాజంలో మార్పునకు ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. సాక్షి, మెదక్ : జిల్లాలో మహిళలదే పైచేయి. జిల్లా జనాభా 7,67,428 ఉంటే అందులో పరుషులు 3,78,654 కాగా 3,88,774 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే 10,120 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. జనాభా పరంగా మహిళలు 51 శాతంపైగా ఉన్నప్పటికీ మహిళా సాధికారత విషయంలో వెనబడే ఉన్నారని చెప్పవచ్చు. విద్య, వృత్తి వ్యాపారులు, రాజకీయాలు, సామాజికరంగాల్లో జిల్లాలోని మహిళల భాగస్వామ్యం తక్కువగానే ఉందని చెప్పువచ్చు. మహిళల్లో అక్షరాస్యతా శాతం తక్కువగా ఉండటంతోపాటు వివక్షను ఎదుర్కొవటం మహిళలు రాణించకపోవటానికి కారణంగా చెప్పుకోవచ్చు. జిల్లాలో మొత్తం 3,77,984 మంది అక్షరాస్యులు ఉండగా వీరిలో 1,54,915 మంది మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. మహిళా అక్షరాస్యత కేవలం 45.15 శాతం ఉంది. అదే పురుషుల అక్షరాస్యత శాతం 67.15 శాతంగా ఉంది. మహిళా అక్షరాస్యత శాతం పెరిగితేనే మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు వీలవుతుందని ఆ దిశగా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని మహిళా సంఘాల చెబుతున్నాయి. సంఖ్య పెరిగినా..కానరాని సాధికారత స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఫలితంగా జిల్లాలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగింది. అయితే మహిళా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి మాత్రం కానరావటంలేదు. జిల్లాలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణితోపాటు 9 మంది జెడ్పీటీసీలు, 10 మంది ఎంపీపీలు, 137 మంది మహిళా సర్పంచ్‌లు, 14 మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణిలు గృహిణి స్థాయి నుంచి ఉన్నత పదవులకు ఎదిగారు. వీరిద్దరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ తమదైన శైలిలో పనిచేస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించే మహిళలకు రోల్‌మోడల్స్‌గా నిలుస్తున్నారు. అయితే మిగతా మహిళా ప్రజాప్రతినిధుల విషయంలో ఇది కానరావటంలేదు. కిందిస్థాయిలో ఉండే జెడ్పీటీసీ, ఎంపీపీ , సర్పంచ్, కౌన్సిలర్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. మహిళా ప్రజాప్రతినిదులు స్వయం నిర్ణయాలు తీసుకునే సత్తా కలిగి ఉన్నప్పటికీ ఇంకా భర్తచాటు భార్యలుగానే ఉంటున్నారు. అండగా నిలవాల్సిన భర్తలు రాజకీయపెత్తనం చెలాయిస్తున్నారు. జిల్లాలోని మండల పరిషత్, మున్సిపల్ సమావేశాల్లో భర్తలు పాల్గొంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. మహిళా ప్రజాప్రతినిధులు స్వయం నిర్ణయాధికారాలతో ముందుకు సాగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమన్న భావన వ్యక్తం అవుతోంది. పాలనలో మహిళా అధికారుల ముద్ర పాలనకు సంబంధించి మహిళా అధికారుల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తనదైన శైలిలో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. మహిళా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గర్భిణులు ఇంటి వద్దకాకుండా ప్రభుత్వ ఆసపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌడిపల్లి పీహెచ్సీలో ప్రయోగాత్మకంగా అమలు చేయిస్తున్నారు. మహిళల గౌరవం కాపాడేందుకు వీలుగా జిల్లాలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెలాఖరుకు జిల్లాను ఓడీఎఫ్‌గా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరో మహిళా అధికారి చందన దీప్తి మహిళలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. జిల్లాలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూనే మరోవైపు మహిళలపై నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో డీఆర్ఓ సహా అన్నిశాఖల్లో మహిళా అధికారులు, సిబ్బంది ఉన్నారు. వీరంతా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు అవుతూనే సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఆందోళన కలిగిస్తున్న దాడులు మహిళలపై పెరుగుతున్న దాడులు ఆందోళనకరమైన అంశం. దీనికితోడు మహిళలు పనిచేసే చోటా అభద్రతా భావాన్ని ఎదుర్కొనటంతోపాటు వివక్షను చవిచూడాల్సిన పరిస్థితి వస్తోంది. జిల్లాలో బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. దీనికితోడు మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సంఘటలను కనిపిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 10 బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మైనర్ బాలికలపై లైంగిక దాడులకు సంబంధించి 12, మహిళలపై వేధించటానికి సంబంధించి 18 కేసులు నమోదయ్యాయి, ఈవ్‌టీజింగ్ 21, . గృహహింస 20, కిడ్నాప్ 6, ట్రాఫికింగ్ 22 కేసులు నమోదయ్యాయి. ఇటీవల జప్తిశివనూరు వేశ్యావాటికపై పోలీసు దాడిచేస్తే అందులో 10 మంది మైనర్ బాలికలను పోలీసులు గుర్తించారు. దాడుల నివారణకు చర్య లు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి జిల్లాలో పొదుపు సంఘాల పనితీరు ఆందరికీ ఆదర్శప్రాయంగా ఉంది. జిల్లాలో 13వేల సంఘాల్లో 1.38 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా పొదుపు మంత్రం పాటిస్తూ ఆర్థిక స్వావలంబనకు పాటుపడుతున్నారు. అలాగే మహిళా సాధికారతకు మార్గనిర్దేశకులుగా మారుతున్నారు. అయితే మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్య, వైద్య, రాజకీయ, ఉద్యోగ రంగాలతోపాటు వృత్తి, వ్యాపార, స్వయం ఉపాధి, సామాజికసేవ రంగాల్లో ఎంతో మంది మహిళలు రాణిస్తున్నారు. కుటుంబంలోని సభ్యులతోపాటు మహిళలు ఎన్నుకున్న రంగంలో తగిన ప్రోత్సాహం లభిస్తే మంచి స్థానాలకు ఎదిగే అవకాశం ఉంటుంది. -
తల్లి సహా ఐదుగురు పిల్లల మృతదేహాలు లభ్యం
పిట్లం(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగాం సమీపంలోని పిల్లివాగులో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మెదక్ జిల్లా కంగ్టీ మండలానికి చెందిన రాజమణి అనే మహిళ తన ఐదుగురు పిల్లలతో సహా కారులో నిజామాబాద్ వెళ్తుండగా.. పిల్లి వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. కారు అందులో కొట్టుకుపోయింది. వరదలో కొట్టుకుపోతున్న కారులో నుంచి బయటపడిన డ్రైవర్ పక్కనే ఉన్న చెట్టును పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. డ్రైవర్ తో పాటు మృతురాలి తమ్ముడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇది గుర్తించిన గ్రామస్థులు తాడు సాయంతో వారిని రక్షించారు. తల్లి సహా ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన ఐదుగురు చిన్నారులలో ప్రియ (7), జ్యోతి (6), జ్ఞాన అశ్మిత (3), జ్ఞాన సమిత (3), గీతాంస (13) ఉన్నారు. మృతదేహాలను బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. -
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం
జెడ్పీ చైర్పర్సన్ రాజమణి బోర్పట్ల గ్రామ శివారులో హరితహారం హత్నూర: తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జెడ్పీ చైర్పర్సన్ రాజమణి రాజమణి అన్నారు. శనివారం బోర్పట్ల గ్రామ శివారులోని కర్నాలకుంట కట్టపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆమె ఈత మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా అనంతరం అధికారులు, విద్యార్థులు, గౌడ కులస్థులు సుమారు 500 ఈత మొక్కలను నాటారు. నాటిన మొక్కలను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, తహసీల్దార్ ప్రభావతి, ఎంపీడీఓ శ్రవణ్‌కుమార్, ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐలు పోతిరెడ్డి, ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, ఎంపీటీసీ సాయమ్మ, సర్పంచ్‌లు వీణాభాస్కర్రెడ్డి, బంటు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కిష్టయ్య, టీఆర్ఎస్ నాయకులు అశోక్, గౌడ సంఘం నాయకులు అంజాగౌడ్, చెన్నాగౌడ్, దుర్గంగౌడ్, యాదాగౌడ్, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
మునిపల్లి: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి పేర్కొన్నారు. శనివారం ఆమె ఎంపీ బీబీ పాటిల్ తదితరులతో కలిసి మండలంలోని అంతారం జీవన్ముక్త మహరాజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అంతారం సర్పంచ్ సిద్దన్న పాటిల్ అధ్వర్యంలో జీవన్ముక్త మహరాజ్, పాండురంగ విఠలేశ్వర, రుక్మాబాయి దేవతామూర్తుల విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అంతకు ముందు టీఆర్ఎస్ కార్యకర్తలు కంకోల్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వస్తున్న జెడ్పీ చైర్పర్సన్, ఎంపీ బీబీ పాటిల్‌ను అంతారం గ్రామానికి చెందిన కొందరు దళిత నేతలు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ‘మీ సమస్యలేమిటో చెప్పండి పరిష్కరించేదుకు కృషి చేస్తా’నని ఎంపీ చెప్పినా వారు పట్టించుకోలేదు. సమస్య ఎదైనా ఉంటే చెబితే సీఎంతో చర్చించి పరిష్కరిస్తానని ఆయన హమీ ఇచ్చారు. అంతారంలో భూమి లేని దళితులందరికి భూమి పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి భూమి లేని నిరుపేదలకు భూమి ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ నచ్చజెప్పడంతో వారు శాంతించారు. జీవన్ముక్త సంస్థానంలో దైవ దర్శనం చేసుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి, ఎంపీ బీబీ పాటిల్‌కు జీవన్ముక్త సంస్థాన పీఠాధిపతి బాల్‌రాజ్ జ్ఞానేశ్వర్ మహరాజ్ ఘనంగా సన్మానం చేశారు. సంస్థానం అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీని జ్ఞానేశ్వర్ మహరాజ్ కోరారు. ఈ సందర్భంగా రాజమణి మాట్లాడుతూ అరుహలందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు సీఎం అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారని ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిద్దన్న పాటిల్, ఎంపీటీసీ సభ్యురాలు నాట్కారి రాచమ్మ టీఆర్ఎస్ నేతలు సాయికుమార్, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రయ్యతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
ముగ్గురు మృతి.. ప్రాణాలతో బయటపడ్డ మరొకరు మెదక్, కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయగా.. అందులో ముగ్గురు మృతి చెందారు. మరొకరు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ సంఘటన మెదక్ పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. రెడ్డిమల్లి శ్యామల మెదక్ మున్సిపల్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో తల్లి రాజమణి (55), పిల్లలు స్పందన(7), నంద కౌశిక్‌రెడ్డి(5)లతో కలిసి పట్టణంలోని వీర హనుమాన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. 2010లో రాజీవ్ యువశక్తి లోన్లు ఇప్పిస్తామంటూ శ్యామల మరికొంత మందితో కలిసి వివిధ పట్టణాల్లో యువకుల నుంచి రూ.14 లక్షలు లంచాలుగా వసూలు చేసింది. అప్పట్లో ఈ మేరకు కేసు నమోదు కాగా అప్పటి నుంచి శ్యామలకు భర్త ప్రభాకర్‌రెడ్డి దూరంగా ఉంటున్నాడు. భర్త ఎడబాటు, కోర్టు కేసులు, అప్పుల బాధలు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన శ్యామల మంగళవారం రాత్రి మెదక్‌లో కుటుంబంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కూల్‌డ్రింక్‌లో కలిపిన విషాన్ని తాగి శ్యామల పిల్లలు స్పందన, నందకౌశిక్రెడ్డి అక్కడికక్కడే మరణించారు. కాగా శ్యామల, ఆమె తల్లి రాజమణి ప్రాణాలు పోకపోవడంతో రోడ్డుపైకి వచ్చి వాహనాల కిందపడి చనిపోయేందుకు యత్నించి విఫలమయ్యారు. దీంతో వీరిద్దరూ కలిసి బుధవారం తెల్లవారుజామున సమీపంలోని మల్లం చెరువులో దూకగా రాజమణి నీట మునిగి మృత్యువాత పడింది. కాగా శ్యామలను కొందరు రక్షించారు. తాను చేసిన తప్పుల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు, కుటుంబ సభ్యుల మరణానికి ఎవరూ బాధ్యులు కారని, తనను క్షమించాలని కోరుతూ శ్యామల ఆమె భర్త ప్రభాకర్‌రెడ్డి నుద్దేశించి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పట్టణ సీఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.