మునిపల్లి: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రాజమణి పేర్కొన్నారు. శనివారం ఆమె ఎంపీ బీబీ పాటిల్ తదితరులతో కలిసి మండలంలోని అంతారం జీవన్ముక్త మహరాజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అంతారం సర్పంచ్ సిద్దన్న పాటిల్ అధ్వర్యంలో జీవన్ముక్త మహరాజ్, పాండురంగ విఠలేశ్వర, రుక్మాబాయి దేవతామూర్తుల విగ్రహాలకు పూజలు నిర్వహించారు.
అంతకు ముందు టీఆర్‌ఎస్ కార్యకర్తలు కంకోల్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీ బీబీ పాటిల్‌ను అంతారం గ్రామానికి చెందిన కొందరు దళిత నేతలు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ‘మీ సమస్యలేమిటో చెప్పండి పరిష్కరించేదుకు కృషి చేస్తా’నని ఎంపీ చెప్పినా వారు పట్టించుకోలేదు. సమస్య ఎదైనా ఉంటే చెబితే సీఎంతో చర్చించి పరిష్కరిస్తానని ఆయన హమీ ఇచ్చారు.
అంతారంలో భూమి లేని దళితులందరికి భూమి పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి భూమి లేని నిరుపేదలకు భూమి ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ నచ్చజెప్పడంతో వారు శాంతించారు. జీవన్ముక్త సంస్థానంలో దైవ దర్శనం చేసుకున్న జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రాజమణి, ఎంపీ బీబీ పాటిల్‌కు జీవన్ముక్త సంస్థాన పీఠాధిపతి బాల్‌రాజ్ జ్ఞానేశ్వర్ మహరాజ్ ఘనంగా సన్మానం చేశారు. సంస్థానం అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీని జ్ఞానేశ్వర్ మహరాజ్ కోరారు.
ఈ సందర్భంగా రాజమణి మాట్లాడుతూ అరుహలందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు సీఎం అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారని ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిద్దన్న పాటిల్, ఎంపీటీసీ సభ్యురాలు నాట్కారి రాచమ్మ టీఆర్‌ఎస్ నేతలు సాయికుమార్, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రయ్యతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
Published Sun, Nov 23 2014 12:43 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement