ముగ్గురు మృతి.. ప్రాణాలతో బయటపడ్డ మరొకరు
మెదక్, కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయగా.. అందులో ముగ్గురు మృతి చెందారు. మరొకరు ప్రాణాలతో బయట పడ్డారు. ఈ సంఘటన మెదక్ పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. రెడ్డిమల్లి శ్యామల మెదక్ మున్సిపల్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో తల్లి రాజమణి (55), పిల్లలు స్పందన(7), నంద కౌశిక్‌రెడ్డి(5)లతో కలిసి పట్టణంలోని వీర హనుమాన్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
2010లో రాజీవ్ యువశక్తి లోన్లు ఇప్పిస్తామంటూ శ్యామల మరికొంత మందితో కలిసి వివిధ పట్టణాల్లో యువకుల నుంచి రూ.14 లక్షలు లంచాలుగా వసూలు చేసింది. అప్పట్లో ఈ మేరకు కేసు నమోదు కాగా అప్పటి నుంచి శ్యామలకు భర్త ప్రభాకర్‌రెడ్డి దూరంగా ఉంటున్నాడు. భర్త ఎడబాటు, కోర్టు కేసులు, అప్పుల బాధలు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన శ్యామల మంగళవారం రాత్రి మెదక్‌లో కుటుంబంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కూల్‌డ్రింక్‌లో కలిపిన విషాన్ని తాగి శ్యామల పిల్లలు స్పందన, నందకౌశిక్‌రెడ్డి అక్కడికక్కడే మరణించారు. కాగా శ్యామల, ఆమె తల్లి రాజమణి ప్రాణాలు పోకపోవడంతో రోడ్డుపైకి వచ్చి వాహనాల కిందపడి చనిపోయేందుకు యత్నించి విఫలమయ్యారు. దీంతో వీరిద్దరూ కలిసి బుధవారం తెల్లవారుజామున సమీపంలోని మల్లం చెరువులో దూకగా రాజమణి నీట మునిగి మృత్యువాత పడింది.
కాగా శ్యామలను కొందరు రక్షించారు. తాను చేసిన తప్పుల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు, కుటుంబ సభ్యుల మరణానికి ఎవరూ బాధ్యులు కారని, తనను క్షమించాలని కోరుతూ శ్యామల ఆమె భర్త ప్రభాకర్‌రెడ్డి నుద్దేశించి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పట్టణ సీఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
Published Thu, Mar 27 2014 1:39 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement