అన్నింటా ఆమె | today Women's Day | Sakshi
Sakshi News home page

అన్నింటా ఆమె

Published Tue, Mar 7 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

అన్నింటా ఆమె

అన్నింటా ఆమె

నేడు మహిళా దినోత్సవం
ఆకాశంలో సగం.. సమాజ నిర్మాణంలో మహోన్నతం.. అన్ని రంగాల్లోనూ పాత్ర అమోఘం.. మహిళల కృషి అనిర్వచనీయం.. వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. నూతనంగా మనుగడలోకి వచ్చిన మెతుకుసీమలో మహిళా జనాభా అధికమే. అయితే ఇప్పటికీ చాలా మందికి ప్రతిభ పాటవాలున్నా వెనుకబాటుకు గురవుతున్నారు.

రాజకీయరంగంలో మహిళలు రాణిస్తున్నా.. కొందరు భర్తచాటునే ఉంటున్నారు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని మహిళా ప్రజాప్రతినిధులు సాధికారతకు దూరమవుతున్నారు. మరోవైపు మహిళలపై పెరుగుతున్న దాడులు ఆందోళనకరం. జిల్లాలో 51 శాతానికిపైగా ఉన్న మహిళలు జిల్లా సమగ్ర అభివృద్ధి, సమాజంలో మార్పునకు ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది.  

సాక్షి, మెదక్‌ : జిల్లాలో మహిళలదే పైచేయి. జిల్లా జనాభా 7,67,428 ఉంటే అందులో పరుషులు  3,78,654 కాగా  3,88,774 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే 10,120 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. జనాభా పరంగా మహిళలు 51 శాతంపైగా ఉన్నప్పటికీ మహిళా సాధికారత విషయంలో వెనబడే ఉన్నారని చెప్పవచ్చు. విద్య, వృత్తి వ్యాపారులు, రాజకీయాలు, సామాజికరంగాల్లో జిల్లాలోని మహిళల భాగస్వామ్యం తక్కువగానే ఉందని చెప్పువచ్చు.

మహిళల్లో అక్షరాస్యతా శాతం తక్కువగా ఉండటంతోపాటు వివక్షను ఎదుర్కొవటం మహిళలు రాణించకపోవటానికి కారణంగా చెప్పుకోవచ్చు. జిల్లాలో మొత్తం 3,77,984 మంది అక్షరాస్యులు ఉండగా వీరిలో 1,54,915 మంది మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. మహిళా అక్షరాస్యత కేవలం 45.15 శాతం ఉంది. అదే పురుషుల అక్షరాస్యత శాతం 67.15 శాతంగా ఉంది. మహిళా అక్షరాస్యత శాతం పెరిగితేనే మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు వీలవుతుందని ఆ దిశగా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని మహిళా సంఘాల చెబుతున్నాయి.

సంఖ్య పెరిగినా..కానరాని సాధికారత
స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఫలితంగా జిల్లాలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగింది. అయితే మహిళా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి మాత్రం కానరావటంలేదు. జిల్లాలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్  రాజమణితోపాటు 9 మంది జెడ్పీటీసీలు, 10 మంది ఎంపీపీలు, 137 మంది మహిళా సర్పంచ్‌లు,  14 మంది మహిళా కౌన్సిలర్లు ఉన్నారు. డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణిలు గృహిణి స్థాయి నుంచి ఉన్నత పదవులకు ఎదిగారు. వీరిద్దరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ తమదైన శైలిలో పనిచేస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించే మహిళలకు రోల్‌మోడల్స్‌గా నిలుస్తున్నారు.

అయితే మిగతా మహిళా ప్రజాప్రతినిధుల విషయంలో ఇది కానరావటంలేదు. కిందిస్థాయిలో ఉండే జెడ్పీటీసీ, ఎంపీపీ , సర్పంచ్, కౌన్సిలర్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. మహిళా ప్రజాప్రతినిదులు  స్వయం నిర్ణయాలు తీసుకునే సత్తా కలిగి ఉన్నప్పటికీ ఇంకా భర్తచాటు భార్యలుగానే ఉంటున్నారు. అండగా నిలవాల్సిన భర్తలు రాజకీయపెత్తనం చెలాయిస్తున్నారు. జిల్లాలోని మండల పరిషత్, మున్సిపల్‌ సమావేశాల్లో భర్తలు పాల్గొంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. మహిళా ప్రజాప్రతినిధులు స్వయం నిర్ణయాధికారాలతో ముందుకు సాగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమన్న భావన వ్యక్తం అవుతోంది.

పాలనలో మహిళా అధికారుల ముద్ర
పాలనకు సంబంధించి మహిళా అధికారుల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.  జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి తనదైన శైలిలో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. మహిళా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గర్భిణులు ఇంటి వద్దకాకుండా ప్రభుత్వ ఆసపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌడిపల్లి పీహెచ్‌సీలో ప్రయోగాత్మకంగా అమలు చేయిస్తున్నారు. మహిళల గౌరవం కాపాడేందుకు వీలుగా జిల్లాలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నెలాఖరుకు జిల్లాను ఓడీఎఫ్‌గా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరో మహిళా అధికారి చందన దీప్తి మహిళలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. జిల్లాలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూనే మరోవైపు మహిళలపై నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో డీఆర్‌ఓ సహా అన్నిశాఖల్లో మహిళా అధికారులు, సిబ్బంది ఉన్నారు. వీరంతా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు అవుతూనే సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నారు.

ఆందోళన కలిగిస్తున్న దాడులు
మహిళలపై పెరుగుతున్న దాడులు ఆందోళనకరమైన అంశం. దీనికితోడు మహిళలు పనిచేసే చోటా అభద్రతా భావాన్ని ఎదుర్కొనటంతోపాటు వివక్షను చవిచూడాల్సిన పరిస్థితి వస్తోంది.  జిల్లాలో బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. దీనికితోడు మైనర్‌ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సంఘటలను కనిపిస్తున్నాయి.

జిల్లాలో ఇప్పటివరకు 10 బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నారు. మైనర్‌ బాలికలపై లైంగిక దాడులకు సంబంధించి 12, మహిళలపై వేధించటానికి సంబంధించి 18 కేసులు నమోదయ్యాయి, ఈవ్‌టీజింగ్‌ 21, . గృహహింస 20, కిడ్నాప్‌ 6, ట్రాఫికింగ్‌ 22 కేసులు నమోదయ్యాయి. ఇటీవల జప్తిశివనూరు వేశ్యావాటికపై పోలీసు దాడిచేస్తే అందులో  10 మంది మైనర్‌ బాలికలను పోలీసులు గుర్తించారు. దాడుల నివారణకు చర్య లు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
జిల్లాలో పొదుపు సంఘాల పనితీరు ఆందరికీ ఆదర్శప్రాయంగా ఉంది. జిల్లాలో 13వేల సంఘాల్లో 1.38 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా పొదుపు మంత్రం పాటిస్తూ ఆర్థిక స్వావలంబనకు పాటుపడుతున్నారు. అలాగే మహిళా సాధికారతకు మార్గనిర్దేశకులుగా మారుతున్నారు. అయితే మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

విద్య, వైద్య, రాజకీయ, ఉద్యోగ రంగాలతోపాటు వృత్తి, వ్యాపార, స్వయం ఉపాధి, సామాజికసేవ రంగాల్లో ఎంతో మంది మహిళలు రాణిస్తున్నారు. కుటుంబంలోని సభ్యులతోపాటు మహిళలు ఎన్నుకున్న రంగంలో తగిన ప్రోత్సాహం లభిస్తే మంచి స్థానాలకు ఎదిగే అవకాశం ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement