సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లాలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారాయి. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని దక్కించుకోవాలనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. జిల్లా పరిషత్ ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. మూడు దఫాలు ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో 16 మండలాలు, మూడు రెవెన్యూ డివిజన్‌లున్నాయి. పరకాల, నర్సంపేట ని యోజకవర్గాలు పూర్తి స్థాయిలో, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలు వర్ధన్నపేట నియోజకవర్గంలో, రాయపర్తి మండలం పాలకుర్తి నియోజకవర్గంలో, శాయంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గంలోకి వస్తాయి.
తొలుత ఏకాభిప్రాయం..
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు టీఆర్‌ఎస్ జిల్లా జిల్లా పరిషత్ ఎన్నిక బాధ్యతను సీఎం కేసీఆర్ అప్పగించారు. దీంతో పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్‌లతో మంత్రి దయాకర్‌రావు సమావేశాన్ని నిర్వహించారు. అందరి ఏకాభిప్రాయంతో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎవ రు సూచిస్తే వారికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపిక కోసం సుదర్శన్‌రెడ్డి కసరత్తు ప్రారంభించారు. సుదర్శన్‌రెడ్డి సతీమణి పెద్ది స్వప్నను నల్లబెల్లి జెడ్పీటీసీగా పోటీ చేయించి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా చేద్దామని అనుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
గండ్ర రానుండడంతో మారిన రాజకీయాలు
భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పార్టీ మారుతుండడంతో రాజకీయాలు మారాయి. కాంగ్రెస్ నుంచి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, భూపాలపల్లి డీసీసీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతిలు టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గండ్ర దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. గండ్ర జ్యోతికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇస్తామని టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది.
జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలిపించుకుని గండ్ర దంపతుల విషయం మాట్లాడినట్లు తెలిసింది. అధిష్టానం ఇచ్చిన హామీని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు చెప్పారని సమాచారం. గండ్ర దంపతులు టీఆర్‌ఎస్‌లోకి రానుండడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. శాయంపేట జెడ్పీటీసీగా బరిలో ఉండేందుకు జ్యోతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే శాయంపేటలో ఓటు హక్కును కల్పిస్తున్నారు. దీంతో దాదాపు గండ్ర జ్యోతికే అవకాశం ఇవ్వనున్నట్లు టీఆర్‌ఎస్‌లో జోరుగా చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment