సాక్షి, ఆసిఫాబాద్: ఈసారి మండల పరిషత్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మండల స్థాయిలో కీలక పదవిగా భావించే మండల పరిషత్ అధ్యక్షుడి (ఎంపీపీ) ఎన్నిక జిల్లాలో విచిత్రంగా ఉండనుంది. కేవలం ఇద్దరంటే ఇద్దరి మద్దతుతోనే ఎంపీపీ పీఠం అధిష్టించే అవకాశం జిల్లాలోని కొన్ని మండలాల్లో నెలకొంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కొత్త మండలాలు ఏర్పడడంతో ముఖ చిత్రం పూర్తిగా మారింది.
మరోవైపు అతి తక్కువ ఎంపీటీసీ స్థానాలు ఉండడంతో ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబా ద్ పరిషత్ పరిధిలో కుమురం భీం జిల్లాలో పా తవి 12 మండలాలు ఉండేవి. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా మరో మూడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఆ సంఖ్య మొత్తం 15కు చేరుకుంది. పది లోపు గ్రామాలతోనే చిన్న మండలాలు ఏర్పడ్డాయి. అలాగే ఎంపీటీసీ స్థానాలు పాత మండలాల్లో తగ్గాయి. జిల్లాలోని సిర్పూర్(యూ) మండలం నుంచి లింగాపూర్, కౌటాల నుంచి చింతలమానెపల్లి, బెజ్జూరు నుంచి పెంచికల్‌పేట మండలాలుగా విడిపోయాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో ఈసారి పరిషత్ ఎన్నికల్లో ఆసక్తికర పోటీ నెలకొంది.
ఇద్దరి మద్దతు చాలు..
జిల్లాలో కొత్తగా ఏర్పడిన మూడు మండలాల పరిధిలో ఒక్కో మండలంలో మొత్తం నాలుగు ఎంపీటీసీ స్థానాలే ఉన్నాయి. దీంతో ఎంపీపీ అభ్యర్థి మినహా మరో ఇద్దరు ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీ పీఠం కైవసం చేసుకోవచ్చు. ఈ పరిíస్థితితో కొత్త మండలాలైన పెంచికల్‌పేట, సిర్పూర్(యూ), లింగాపూర్ మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు భారీగా పోటీ నెలకొంది. ప్రస్తుతం తొలి దశ పరిషత్ ఎన్నికలు జరిగే పెంచికల్‌పేట మండలంలో ఎంపీటీసీ స్థానాలకు భారీ పోటీ ఉంది. గెలిచిన అభ్యర్థులు ఎవరికి వారే ఎంపీపీ పీఠం ఎక్కేందుకు ఆసిక్తి కనబర్చుతున్నారు.
అలా గే బెజ్జూరు, చింతలమానెపల్లి, దహేగాం, సిర్పూర్(టి) మండలాల్లో ఎనిమిది చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో కనీసం నాలుగురు ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీ అయ్యే అవకాశముంది. తిర్యాణిలోనూ ఏడు ఎంపీటీసీ స్థానా లకు నలుగురి మద్దతు చాలు. ఇక అధిక ఎంపీటీసీ స్థానాలు ఉన్న జైనూర్, కెరమెరి మండలాల్లో ఒక్కో మండలంలో తొమ్మిది చొప్పున ఉండగా ఇక్కడ కనీసం ఐదుగురి మద్దతు అవసరం. జిల్లాలో అత్యధిక ఎంపీటీసీ స్థానాలు ఉన్న కాగజ్‌నగర్ మండలంలో 15 స్థానాలకు కనీసం 8 మంది మద్దతు కూడగట్టాల్సి వస్తోంది. ఆసిఫాబాద్, రె బ్బెన మండలాల్లో పది స్థానాలు ఉండగా కనీసం ఆరుగురి మద్దతు అవసరం. దీంతో ఎంపీపీ ఆశావహులు తమకు నచ్చిన వారిని పోటీలో ఉండేట్లు ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేసకుంటున్నారు.
ప్రతి సభ్యుడు కీలకం..
చిన్న మండలాల్లో ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఎంపీటీసీ సభ్యుడు మండల అధ్యక్షుడి ఎన్నికలో కీలకం కానున్నారు. ఒకే పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు ఎంపీపీ స్థానానికి కావాల్సిన మెజార్టీ సా ధిస్తే ఏ సమస్య ఉండదు. కాని వేర్వేరు పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందింతే ఎంపీపీ ఎన్నికల్లో కీలకం కానున్నారు. దీంతో అన్ని పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులు ఎవరు ఎటు మద్దతు ఇస్తారో ఆ పార్టీ వైపే ఎంపీపీ ఎన్నిక ఆధారపడనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తాయిలాల కు ఆస్కారం ఏర్పడనుంది. దాంతో పాటు గతంలో మాదిరి ఎంపీపీ మాకు వైస్ ఎంపీపీ మీకు అనే ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో పదవుల పంపకాలు జరిగే ఆస్కారం ఏర్పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment