సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీలో చివరి రోజు ఆదివారం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలకు అనుకూలంగా పార్టీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయి. రాహుల్ గాంధీ జిందాబాద్..ప్రియాంక గాంధీ జిందాబాద్..అంటూ పార్టీ కార్యకర్తలు నినదించారు. ‘రాహుల్.. ప్రియాంక దేశాన్ని కాపాడాలి..‘రాహుల్ మీరు పోరాడండి..మీతోనే మేముంటా’మని పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి జరిగిన ప్లీనరీకి 3000 మందికి పైగా ప్రతినిధులు, 15,000 మందికి పైగా కార్యవర్గసభ్యులు, కార్యకర్తలను ఆహ్వానించారు.
సంక్లిష్ట సమయంలో తమ కుమారుడు రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టారని పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అంతకుముందు ప్లీనరీలో స్వాగతోపన్యాసం చేసిన పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టారు. జాతి ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం కాంగ్రెస్ మాత్రమే పరిష్కరించగలదని అన్నారు.కేంద్ర సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుంటోందని..పాలక బీజేపీ విద్వేషం విరజిమ్ముతుంటే మనం ప్రేమను పంచుతుందని స్పష్టం చేశారు. దేశంలో ప్రజలందరి మేలు కోసం కాంగ్రెస్ పాటుపడుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment