
సాక్షి, తాడేపల్లి : సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చర్చకు సిద్దమా అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాయించింది చంద్రబాబు కాదా అని సూటిగా ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యాలయం, బాలకృష్ణ ఆఫీస్ నుంచి వైఎస్సార్‌సీపీపై తప్పుడు పోస్టింగ్‌లు చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్.. సీఎం వైఎస్ జగన్ కుటుంబంపై చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
చంద్రబాబు మీడియాతో మాట్లాడిన తీరును ఆ పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారని చెప్పారు. మహిళలు వినలేని మాటలను చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్‌ను సీఎంకు, వైఎస్సార్‌సీపీకి ముడి పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు మీద ఎవరైనా తప్పుడు పోస్టింగ్‌లు పెడితే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందని సూచించారు. చంద్రబాబు మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని.. ఆయనను వెంటనే వైద్యులకు చూపించాలని అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల విష వృక్షమని.. సోషల్ మీడియాలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా వదల్లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సీఎం వైఎస్ జగన్ నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించడాన్ని చంద్రబాబు జీర్ణించుకుకోలేకపోతున్నారని విమర్శించారు. జూనియర్ ఆర్టిస్ట్‌లతో సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు దుష్ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ తీసుకోస్తున్న విప్లవాత్మక మార్పులు చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. (చదవండి: క్షుద్ర పూజలు చేయించింది నువ్వు కాదా?)