
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల పంపకంలో గందరగోళానికి ఇంకా తెరపడలేదు. తాము 12 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలంగాణ జన సమితి ప్రకటించింది. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పి.ఎల్ విశ్వేశ్వరరావు టీజేఎస్ పోటీ చేసే స్థానాల పేర్లు ప్రకటించారు. దుబ్బాక, మెదక్, మల్కాజ్‌గిరి, అంబర్‌పేట, సిద్దిపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, ఆసిఫాబాద్, స్టేషన్ ఘన్‌పూర్, జనగాం, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. కాగా, మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై సంప్రదింపులు ఇంకా సాగుతున్నట్లు టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి తెలిపారు. పార్టీ ప్రకటించిన అన్ని స్థానాల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటామని చెబుతూనే ఒకటి రెండు సీట్లు అటూఇటుగా పోటీ చేస్తామని చెప్పడం గందరగోళానికి తెరలేపింది.
మిత్రపక్షాల స్థానాల్లోనూ పోటీ
టీజేఎస్ పోటీ చేయనున్నట్లు ప్రకటించిన స్థానా ల్లో మహాకూటమి పక్షాలు కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన స్థానాలు కూడా ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్, ఆసిఫాబాద్ స్థానాల నుంచి కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్న జనగాం స్థానం నుంచి తామే పోటీలో ఉంటామని టీజేఎస్ ప్రకటించింది.