ఓవైసీ సవరణలకు నో.. ట్రిపుల్‌ తలాక్‌కు ఆమోదం | Triple Talaq Bill Passed In Lok Sabha | Sakshi
Sakshi News home page

ఓవైసీ సవరణలకు నో.. ట్రిపుల్‌ తలాక్‌కు ఆమోదం

Published Thu, Dec 28 2017 8:18 PM | Last Updated on Thu, Dec 28 2017 8:45 PM

Triple Talaq Bill Passed In Lok Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎట్టకేలకు ట్రిపుల్‌ తలాక్ బిల్లు (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లులో ఒక్క సవరణ లేకుండా మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అసదుద్దీన్‌ ఓవైసీ ప్రతిపాదించిన సవరణలతోపాటు ఇతరులు ప్రతిపాదించిన సవరణలకు కూడా మద్దతు లభించకపోవడంతో అవి వీగిపోయినట్లు ప్రకటించిన స్పీకర్‌ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. దీంతో ఇక ఈ బిల్లు రాజ్యసభలోకి అడుగుపెట్టనుంది. గురువారం లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లుకు తాను వ్యతిరేకం అని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఆయన ప్రసంగిస్తూ పలు సవరణలు ప్రతిపాదించారు.

ముస్లింలను సంప్రదించకుండానే బిల్లును తీసుకొచ్చారన్న ఆయన ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నారు. దీనితో ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందని, ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త జైలుకు వెళితే ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని అసదుద్దీన్‌ ప్రశ్నించారు. కాగా, అంతకుముందు మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ నేడు చారిత్రాత్మక దినం అన్నారు. ఇది కేవలం ఒక మతానికి సంబంధించినది మాత్రమే కాదని, ముస్లిం మహిళలకు పెద్ద ఊరట అని, లింగ సమానత్వం కూడా ఈ బిల్లు ద్వారా అందుతుందని చెప్పారు. ముస్లిం మహిళలకు ఈ బిల్లు ఎంతో సహాయం చేస్తుందని, ఓటు బ్యాంకు రాజకీయాలను ఈ బిల్లుతో ముడిపెట్టవద్దని ఆయన కోరారు. మరోపక్క, ఈ బిల్లును స్టాండింగ్‌ కమిటీకి పంపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కాగా, ఎంఐఎం, బిజు జనతాదల్‌ వంటి పార్టీలు మాత్రమే ఈ బిల్లు ముస్లిం మహిళలకు వ్యతిరేకం అని అన్నారు. అలాగే, ముస్లి పర్సనల్‌ లా బోర్డు కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. ఏదీ ఏమైనా మొత్తానికి ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017కు మూజువాణి ఓటుతో ఆమోదం లభించాయి.

ట్రిపుల్‌ తలాక్‌కు లోక్‌సభ ఆమోదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement