
సాక్షి, ఔరంగాబాద్ : ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో మరోసారి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ముస్లిం మతానికి చెందిన పురుషులను శిక్షించే వ్యూహంలో భాగంగానే ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. ముస్లిం మహిళలను రోడ్లెక్కించాలని, పురుషులను మాత్రం జైలుకు పంపాలనే కుట్రతోనే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని అన్నారు.
సోమవారం రాత్రి ఓ బహిరంగ సభలో ఆయన ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో కేంద్రంపై విమర్శలు చేశారు. పద్మావత్ సినిమా వివాదం పరిష్కారానికి ఓ కమిటీని ఏర్పాటుచేశారు కానీ, ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో మాత్రం ఎలాంటి కమిటీని వేయలేదని చెప్పారు. 'ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా చేసిన కుట్రే ట్రిపుల్ తలాక్ బిల్లు. ముస్లిం మహిళలను రోడ్లపైకి తీసుకురావడానికి, పురుషులను జైళ్లలోకి పంపించడానికి అది ఒక వ్యూహం మాత్రమే' అని ఆయన అన్నారు.
మరోపక్క, ఎవరైతే, తలాక్ ద్వారా విడాకులు కోరుకుంటారో వారిని సామాజిక బహిష్కరణ చేయాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో ముస్లిం మహిళల అభివృద్ధికి రూ.2వేల కోట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. సెలక్ట్ కమిటీకి బిల్లును పంపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ఈ బిల్లు రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందలేదు.
Comments
Please login to add a commentAdd a comment