
న్యూఢిల్లీ: తెలంగాణలో మరోసారి టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందని సర్వేలు స్పష్టం చేశాయి. సీ–వోటర్, టైమ్స్ నౌ, ఐటీటెక్ గ్రూప్ తదితర సంస్థలు నిర్వహించిన సర్వేల ఆధారంగా ఓ నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ప్రకారం త్వరలో ఎన్నికలు జరిగనున్న ఐదు రాష్ట్రాల్లో మూడింటిలో బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉండగా, వాటిలో రెండు రాష్ట్రాలను ఈసారి కాంగ్రెస్ చేజిక్కించుకోనుంది. అదే జరిగితే వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు కాంగ్రెస్‌కు కొత్త శక్తి వస్తుంది.
తెలంగాణ: రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ద టీమ్ ఫ్లాష్, వీడీఏ అసోసియేట్స్ అనే రెండు సంస్థలు వేర్వేరుగా జరిపిన సర్వేలను విశ్లేషించిన అనంతరం తెలంగాణలో టీఆర్‌ఎస్ మళ్లీ అధికారం చేపడుతుందని అంచనా వేస్తున్నారు. విశ్లేషణల ప్రకా రం టీఆర్‌ఎస్ ఏకంగా 85 సీట్లు గెలవనుండ గా, కాంగ్రెస్ కేవలం 18 సీట్లతో రెండో స్థానం లో నిలవనుంది. ఎంఐఎం 7, బీజేపీ 5, ఇతరులు నాలుగు సీట్లు గెలవొచ్చని తెలుస్తోంది.
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ ప్రజలు మరోసారి బీజేపీ ప్రభుత్వానికే పట్టం కడతార ని విశ్లేషణలు అంటున్నాయి. ఇక్కడ మొత్తం 230 శాసనసభ నియోజకవర్గాలుండగా సీ–వోటర్, ఐఈటెక్ గ్రూప్, టైమ్స్ నౌ సంస్థలు నిర్వహించిన సర్వేలను విశ్లేషించిన అనంతరం.. బీజేపీకి 126, కాంగ్రెస్‌కు 97, ఇతరులకు 7 సీట్లు రావొచ్చని అంచనాలు ఉన్నాయి.
రాజస్తాన్: ఇక్కడి మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 200. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ అధికారంలో ఉండగా ప్రతి ఎన్నికలోనూ అధికారం మారడం సాధారణమే. కాంగ్రెస్ పార్టీ ఈసారి 129 సీట్లు గెలిచి అధికారం చేపడుతుందని తెలియవస్తోంది. బీజేపీకి 63, ఇతరులకు 8 సీట్లు రానున్నట్లు సమాచారం.
ఛత్తీస్‌గఢ్: మధ్యప్రదేశ్‌లాగే ఇక్కడ కూడా బీజేపీ వరుసగా గత మూడుసార్లు గెలిచింది. ఇప్పుడు మాత్రం ఆ అవకాశం లేనట్లేననిపిస్తోంది. కాంగ్రెస్ అత్యంత స్వల్ప ఆధిక్యంతో గెలవొచ్చని తెలుస్తోంది. ఇక్కడి శాసనసభ నియోజకవర్గాల మొత్తం సంఖ్య 90 కాగా, అధికారం చేపట్టేందుకు కనీసం 46 స్థానాల్లో గెలవాలి. అయితే కాంగ్రెస్ 47 స్థానాల్లో (మెజారిటీ కన్నా కేవలం ఒక్కటి ఎక్కువ) గెలిచి అధికారం చేపడుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. బీజేపీకి 39, ఇతరులకు 4 సీట్లు రావొచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment