
సాక్షి,సిటీబ్యూరో: ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాకు టీఆర్‌ఎస్ ఫైనల్ టచ్ ఇచ్చింది. ఖైరతాబాద్ స్థానానికి మాజీ మంత్రి దానం నాగేందర్, మేడ్చల్‌కు ఎంపీ మల్లారెడ్డి, మల్కాజిగిరికి మైనంపల్లి హన్మంతరావు, ముషీరాబాద్‌కు ముఠా గోపాల్, గోషామహల్‌కు ప్రేమ్‌సింగ్ రాథోడ్‌ల అభ్యర్థిత్వాలను పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. మంగళవారం అమావాస్య కారణంగా జాబితా ప్రకటనకు బ్రేక్ వేశారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఖైరతాబాద్ నియోజకవర్గం అభ్యర్థిత్వం కోసం దానం నాగేందర్‌తో పాటు కార్పొరేటర్లు విజయారెడ్డి, విజయలక్ష్మి, నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి పోటీ పడ్డా.. వివిధ కారణాలతో పార్టీ ముఖ్య నేతలు దానం వైపే మొగ్గు చూపినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల కథనం. నాగేందర్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించగానే విజయారెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముషీరాబాద్ స్థానంలోనూ ఆయన కోరికకు భిన్నంగా ముఠా గోపాల్‌ను ఖరారు చేశారు. గోపాల్‌కు బదులు ఆ సీటును నాయిని అల్లుడు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని, అదీ కుదరకపోతే తనకే ఇవ్వాలని నాయిని.. పార్టీ ముఖ్య నేతలకు విన్నవిస్తూ వస్తున్నారు. కానీ అవేవి పరిగణలోకి తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఇక మేడ్చల్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీతో ఆ స్థానంలో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డిని ఖరారు చేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపుతున్న దృష్ట్యా మల్లారెడ్డిని పోటీకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్సీ పదవి హామీతో తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అంత సంతృప్తికరంగా లేనట్టు తెలిసింది. ఇక మల్కాజిగిరి స్థానాన్ని ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావుకు ఖరారు చేశారు. ఈ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, తాను మాత్రంఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని, రాజీపడే ప్రసక్తే లేదని కనకారెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. తొలుత దానం నాగేందర్‌కు కేటాయించిన గోషామహల్ స్థానాన్ని మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రేంసింగ్ రాథోడ్‌కు కేటాయించారు. అంబర్‌పేట నియోకజకవర్గం టికెట్ కోసం నియోకజవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి కృష్ణాయాదవ్‌లు పోటీ పడ్డా.. చివరికి కాలేరు వెంకటేష్‌కు ఖరారు చేశారు. ఇక్కడ పలువురు కార్పొరేటర్లు వెంకటేష్ అభ్యర్థితాన్ని వ్యతిరేకిస్తున్నా సరే ఆయనకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించారు.
కాలేరు.. సరికారు.. నలుగురు కార్పొరేటర్ల అసమ్మతి
సాక్షి, సిటీబ్యూరో: అంబర్‌పేట నియోజకవర్గ టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి అగ్గి ఒక్కసారిగా బగ్గుముంది. ఈ నియోజకవర్గాన్ని కాలేరు వెంకటేష్‌కు కేటాంచారన్న వార్తల నేపథ్యంలో నియోజకవర్గంలోని నలుగురు కార్పొరేటర్లు తిరుగుబాటు జెండాను ఎగురవేశారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పార్టీని గెలిపిస్తామని అంబర్‌పేట కార్పొరేటర్ పులి జగన్, నల్లకుంట కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి, బాగ్ అంబర్‌పేట కార్పొరేటర్ పద్మావతి, కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్యకన్నా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంగళవారం సమావేశం పెట్టి మరీ ఈ నలుగురు తమ అసమ్మతిని ప్రకటించారు. నియోజకవర్గంలో వరుస విజయాలు సాధించిన తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని ఢీకొనాలంటే ఆయనకు తగిన బలమైన అభ్యర్థి బరిలో ఉండాలని వారు చెబుతున్నారు. కాలేరు వెంకటేశ్‌తో అది సాధ్యం కాదని, ఆయనకు టికెట్ ఇస్తే తాము పనిచేయమని పరోక్షంగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment