పదవులేవీ.. అధ్యక్షా! | TRS Leaders Intrested In Nominated Posts In Nalgonda | Sakshi
Sakshi News home page

పదవులేవీ.. అధ్యక్షా!

Published Sun, Sep 8 2019 10:01 AM | Last Updated on Sun, Sep 8 2019 10:03 AM

TRS Leaders Intrested In Nominated Posts In Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : గత ఏడాది డిసెంబర్‌లో పార్టీ రెండో సారి అధికారం చేపట్టాక వెనువెంటనే జరిగిన గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పలువురికి అధికారిక పదవులు పొందే అవకాశం దక్కింది. సర్పంచులుగా, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేయడానికి టికెట్‌ రాని వారిని పార్టీ పదవుల పేరుచెప్పి బుజ్జగించారు. ఒక్క మున్సిపల్‌ ఎన్నికలు మినహా.. ఇక ఏ ఎన్నికలూ లేవు. మున్సిపల్‌ ఎన్నికలు కేవలం పరిమి తమైన సంఖ్యలో మాత్రమే.. అదీ పట్టణ ప్రాంత కేడర్‌కు మాత్రమే అవకాశం కల్పించే వీలు ఉంది. కాగా, జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో పనిచేస్తున్న నాయకులు తమకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందన్న ఆవేదనలో ఉన్నారు.

మోక్షం లేని పార్టీ కమిటీలు
సభ్యత్వ నమోదు పూర్తయ్యాక సంస్థాగత కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. తద్వారా గ్రామ, మండల కమిటీల్లో కొందరిని సర్దే అవకా శం ఉండేదని అంటున్నారు. పార్టీ కమిటీల వ్య వహారం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో.. పార్టీ పదవులకూ మోక్షం లభించడం లేదని అంటున్నారు. ఇక, నియోజవర్గ స్థాయి, జిల్లా కమిటీల ఊసే లేదు. 2014లో టీఆర్‌ఎస్‌ తొలి సారి అధికారంలోకి వచ్చాక పార్టీ నిబంధనావళికి కొన్ని సవరణలు చేసింది. వీటి ప్రకారం జిల్లా అధ్యక్ష పోస్టు లేకుండా పోయింది.

జిల్లాకు ఇద్దరు ఇన్‌చార్జులను నియమిస్తామని ఆ సవరణల్లో పేర్కొంది. ఆ మేరకు కూడా జిల్లాలో ఎవరినీ నియమించలేదు. సుదీర్ఘ కాలం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుత జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి ఆ పదవిలో కొనసాగుతున్నారు. నియోజకవర్గాలకు ఎమ్మెల్యేల నేతత్వంలోనే ఇన్‌చార్జుల వ్యవస్థకు ప్రాణం పోసింది. దీంతో ఆ కమిటీలు లేకుండా పోయాయి. ఇపుడు సభ్యత్వ నమోదు కూడా పూర్తయ్యాక.. పార్టీ కమిటీలపై కసరత్తు చేయాల్సిన నాయకత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

నామినేటెడ్‌ పదవుల ఊసేలేదు
మరోవైపు పలువురు నాయకులు ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నా.. ఆ పదవుల భర్తీ ఊసే కనిపించడం లేదు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావంనుంచి పార్టీలో పనిచేస్తున్న సీనియర్లు చాలామందికి గత ప్రభుత్వంలో పదవులు పొందే అవకాశం దక్కలేదు. రెండోసారి పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో ఈసారన్నా తమ కోరికి తీరుతుందా లేదా అన్న సంశయంలో కొందరు నాయకులు ఉన్నారు. జిల్లాలో కొందరు నాయకులకు నామినేటెడ్‌ పోస్టులు దక్కినా.. అది స్వల్పమే. రాష్ట్రస్థాయి కార్పొరేషన్లలో సభ్యులుగా.. జిల్లాస్థాయి పోస్టుల కోసం పలువురు ఇప్పటికీ ఆశగా ఎదురుచూస్తున్నారు.

కొత్త–పాతల నడుమ పోటీ
ప్రధానంగా పార్టీలో ఇప్పుడు కొత్త–పాతల పోటీ నడుస్తోంది. పార్టీ ఆవిర్భావంనుంచి కొనసాగుతున్న నాయకులు, కేడర్‌కు.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2014 నుంచి ఇప్పటి దాకా ఆయా పార్టీల నేతలతో వలసవచ్చిన వారి మధ్య పొసగడం లేదు. నియోజకవర్గాల్లో ఇస్తున్న ప్రాధాన్యం విషయంలోనూ తారతమ్యం చూపిస్తున్నారన్న విమర్శ పాత నేతలనుంచి వస్తోంది. నకిరేకల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గాలు కొనసాగుతున్నాయి. అవి పదవుల విషయంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. నల్లగొండ నియోజకవర్గం విషయానికి వచ్చేవరకు ముందు నుంచి పార్టీలో ఉన్న వారికంటే ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వెంట, ఆ తర్వాత టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం లభిస్తోందని వాపోతున్నవారూ ఉన్నారు.

మిర్యాలగూడ నియోజకవర్గంలో సైతం ముందు నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్న వారికంటే, ఎమ్మెల్యే భాస్కర్‌ రావు వెంట కాంగ్రెస్‌ నుంచి పార్టీలోకి వచ్చిన వారికే ప్రాముఖ్యం ఇస్తున్నారని, పదవుల విషయంలోనూ ఇదే జరుగుతోందని పేర్కొంటున్నారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో రెండు వర్గాలు ఉన్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అటు పార్టీ పదవులు దక్కడంలో కానీ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పాలకమండళ్లు, దేవాలయ పాలక మండళ్లకు చెందిన పదవుల భర్తీ విషయంలో ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతప్తి పాత కేడర్‌లో ఉంది. మొత్తంగా జిల్లా టీఆర్‌ఎస్‌లో ఇప్పుడు పదువుల లొల్లి షురూ అయ్యింది. పార్టీ సంస్థాగత పదవుల, నామినేటెడ్‌ పదవుల పందేరం మొదలైతే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల నడుమ మరిన్ని తేడాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement