సాక్షి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మొదలైన అధికార టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయా..? పాత–కొత్త నేతల మధ్య తిష్టవేసి కూర్చున్న ఆధిపత్య పోరు ప్రభావం చూపుతోందా..? కొత్తగా పార్టీలో చేరి పదవులు చేపట్టిన నేతలున్న చోట ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందా..? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత సభ్యత్వాన్ని నమోదు చేయాలన్నది టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టార్గెట్లు విధించి మరీ సభ్యత్వాలు నమోదు చేయిస్తోంది.
సాధారణ సభ్యత్వంతోపాటు.. క్రియాశీలక సభ్యత్వాలు చేయిస్తున్నారు. షరా మామూలుగానే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకే అగ్ర తాంబూలం. దీంతో వారికి ఇష్టమున్న వారికే సభ్యత్వం దక్కుతుంది..? లేదనుకుంటే లేదు.. అది ఎంత పెద్దస్థా యి నాయకుడైనా.. ఎమ్మెల్యే సమ్మతి లేకుండా సభ్యత్వం దక్కే అవకాశమే లేకుండా పోయిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ సమస్యను రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం మాత్రం లభించడం లేదన్నది వారి ఆవేదన.
పాత–కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు
టీఆర్‌ఎస్‌లో గడిచిన అయిదారేళ్లుగా వేళ్లూనుకున్న ప్రధాన సమస్య పాత–కొత్త నేతల ఆధిపత్య పోరు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు.. పార్టీ అధికారం చేపట్టాక వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చి చేరిన వారు పాత–కొత్త నేతలుగానే కొనసాగుతున్నారు. ఈ రెండు వర్గాలు కలిసిపోయి పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు దాదాపు తక్కువే. ఈ సమస్య ఇపుడు సభ్యత్వాల నమోదుపై ప్ర భా వం చూపుతోందని అంటున్నారు. కేవలం పాత–కొత్త నాయకత్వాలు ఉన్న చోట మాత్రమే కాకుండా.. సమ ఉజ్జీలైన ఇద్దరు నాయకులు ఉన్న చోటా ఈ సమస్య ఉత్పన్నమవుతోందని చెబుతున్నారు.
గత సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చోటు చేసుకున్న పరిణామాలే తాజా నమోదు కార్యక్రమంలోనూ పునరావృతమవుతున్నాయని అభిప్రాయం ప డుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ సమ స్య కోదాడ, ఆలేరు, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉందని అంటున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 50వేల చొప్పున కనీసం ఆరు లక్షల సభ్యత్వాలు చేయించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. ఆరు నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయని సమాచారం. కాగా, గడిచిన మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు జరుగుతోంది.
కొన్ని నియోజకవర్గాల్లో ఇలా..
► కోదాడలో మొదటి నుంచి శశిధర్ రెడ్డి పార్టీ నేతగా ఉండగా.. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు వచ్చి చేరారు. మొన్నటి 2018 ఎన్నికల్లో బొల్లం మల్లయ్య యాదవ్ టీడీపీ నుంచి గులాబీ గూటికి చేరారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇక్కడ సభ్యత్వ పుస్తకాలు ఆ పాత నేతలకు ఇచ్చే విషయంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సమాచారం.
► ఆలేరులో ముందు నుంచీ ఎమ్మెల్యే సునిత ఉన్నా.. గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వెంట కొంత క్యాడర్ వచ్చి చేరింది. వీరికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని పేర్కొంటున్నారు.
► మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వర్గాలు ఉన్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కూసుకుంట్ల ఉన్నారు. సభ్యత్వ నమోదు పూర్తి బాధ్యత కూడా ఆయనకే ఉంది. దీంతో కర్నె వర్గానికి సభ్యత్వ పుస్తకాలు దక్కడం లేదని చెబుతున్నారు.
► నకిరేకల్ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆ తర్వాతి పరిణామాల్లో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ నాయకత్వ నిర్ణయం ప్రకారం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుప్రీమ్. దీంతో అక్కడి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. నియోజవర్గ వ్యాప్తంగా సభ్యత్వాలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ, శాసన మండలి డిప్యుటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పంచుకున్నారని అంటున్నారు. దీంతో వీరేశం వర్గ నాయకులకు సభ్యత్వ పుస్తకాలు అందడం కానీ, సభ్యత్వాలు ఇవ్వడం కానీ జరగడం లేదన్నది ఆ వర్గీయుల ఆరోపణ.
నాగార్జునసాగర్‌లో మండలానికో బాధ్యుడు
ఉప ఎన్నిక జరగనున్న నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును బయటి ప్రాంతాలకు చెందిన నేతలకు మండలానికొకరి చొప్పున బాధ్యతలు అప్పజెప్పారని స్థానిక నాయకులు చెబుతున్నారు. సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ నియోజకవర్గానికి ప్రస్తుతానికి ఇన్‌చార్జి అంటూ ఎవరూ లేరు. సభ్యత్వాల నమోదు బాధ్యతను అటు నోముల కుటుంబం నుంచి పార్టీలో నాయకుడిగా ఉన్న ఆయన తనయుడు భగత్‌కు కానీ, ఇతర నాయకులకు గానీ ఇవ్వలేదని సమాచారం. ఇక్కడినుంచి ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఆయనకూ పూర్తి బాధ్యతలు ఇవ్వలేదని పార్టీ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment