అమరులారా వందనం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ మలిదశ పోరాటంలో తొలిఅమరుడు జిల్లాకు చెందిన కాసోజు శ్రీకాంతచారి. ఆయన ఆత్మబలిదానం తర్వాతే తెలంగాణ ఉద్యమం మరింత ఊపందుకుంది. ఆ తర్వాత మూడునాలుగేళ్ల పాటు సాగిన ఉద్యమంలో జిల్లాకు చెందిన ఎంతోమంది యువకులు తమ ప్రాణాలను అర్పించారు. శ్రీకాంతచారి, వేణుగోపాల్‌రెడ్డి వంటి వారితో పాటు జిల్లా నలుమూలలా ఆత్మహత్యలు చేసుకున్న వారూ ఉన్నారు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది. మలిదశ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించి, రాష్ర్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన టీఆర్‌ఎస్‌కే ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో పట్టంగట్టారు. కొత్త రాష్ట్రంలో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కేసీఆర్ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీ మేరకు అధికారులు సైతం అమరులను గుర్తించడంలో వేగంగా పనిచేశారు.
రాష్ట్రం ప్రభుత్వం ఒక్కో అమరవీరుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. దీనికోసం తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లా అధికారులకు మొత్తంగా 64 దరఖాస్తులు అందాయి. వీటిపై తక్షణం స్పందించిన కలెక్టర్ చిరంజీవులు అన్ని మార్గాల్లో విచారణ జరిపించారు. పోలీసు కేసులు నమోదు కావడం, ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యిందా..? పత్రికల్లో వచ్చిన వార్తలు తదితరాలతో పాటు రెవెన్యూ, పోలీసు అధికారులతో విచారణ చేయించి విరాలు సేకరించారు. అమరవీరులను గుర్తించడంలో ఎలాంటి జాగు లేకుండా అర్హుల జాబితాను సిద్ధం చేయడంతో త్వరలోనే వీరి కుటుంబాలకు సాయం అందనుంది.