రుణం.. రణం
నల్లగొండ : ఆరుగాలం శ్రమించే రైతన్నకు అప్పు పుట్టడం లేదు. పంట రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీపై స్పష్టత వచ్చేంత వరకు వేచిఉండాలని బ్యాంకర్లు తేల్చిచెబుతున్నారు. పాత రుణాలు చెల్లిస్తేనే కొత్తవాటిని మంజూరు చేస్తామని మెలిక పెట్టి ముప్పుతిప్పలు పెడుతున్నారు. బ్యాంకర్లు పెడుతున్న పేచీలను భరించలేక రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నామమాత్రంగానే రుణాలు మంజూరు చేశారు. దీంతో పంటల సాగుకు పెట్టుబడులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్‌లో పంట రుణాల లక్ష్యం రూ.1226 కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం రూ. 160 కోట్లు మాత్రమే చెల్లించారు.
తప్పని నిరీక్షణ
ఈ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 5 లక్షల 6 వేల 826 హెక్టార్లు కాగా వీటిలో 6 లక్షల 50 వేల హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉంది. దీనికి అవసరమైన విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. అయితే పంట రుణాలు అందించేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీపై స్పష్టత వస్తే తప్ప రుణాలు మంజూరు చేయలేని పరిస్థితి ఉందని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఏ మేరకు రుణ మాఫీ చేస్తుందన్న ఆశతో రైతులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే పలు చోట్ల రుణాల కోసం బ్యాంకులకు వెళ్లిన రైతులకు పాత రుణాలనే రెన్యువల్ చేస్తున్నారు తప్ప కొత్తగా రుణాలు ఇవ్వడం లేదు. కొన్ని చోట్ల మాఫీ చేసిన రుణాలను ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేస్తే కానీ కొత్త రుణాలు ఇవ్వమని తేల్చిచెబుతున్నారు. బావులు, బోర్ల కింద పంటలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మరింత ద యనీయంగా మారింది. బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో పెట్టుబడుల కోసం గ్రామాల్లోని వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.