
సాక్షి,సిటీబ్యూరో: అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల సంకేతాలు వెలువడగానే ‘తమకు టికెట్ గ్యారంటీ’ అని కొందరు నాయకులు పండగ చేసుకున్నారు. అధికార పార్టీ తొలి జాబితాలో తమ పేర్లు లేకపోయేసరికి ఒకింత కలవరపడ్డారు. త్వరలో రెండో జాబితా వస్తుందని.. అందులో తాము తప్పక ఉంటామని సర్దిచెప్పుకున్నారు. అయితే, పండగలు, పర్వదినాలు వెళుతున్నా.. టీఆర్ ఎస్ రెండో జాబితా ఊసెత్తకపోవడం నగరంలోని ముఖ్య నేతలందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అసలు ‘ఇస్తరా.. ఇవ్వరా’ అన్న విషయంపై కూడా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడం టికెట్లు ఆశిస్తున్న సీనియర్ నేతల్లో గుబులు రేపుతోంది. ఆదివారం నిర్వహించిన అభ్యర్థుల దిశానిర్దేశనానికి సైతం తమకు పిలుపు రాకపోవడంతో ‘మరికొన్ని రోజులు సస్పెన్స్ ఎలా భరించా’లంటూ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.
ముఖ్యంగా ముషీరాబాద్ స్థానంలో తన అల్లుడు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి గాని లేదంటే తనకుగాని టికెట్ ఇవ్వాలని హోంమంత్రి నాయిని పార్టీ అధిష్టానానికి ఇప్పటికే విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ సీటు తనదేనన్న భరోసాతో స్థానిక నాయకుడు ముఠా గోపాల్ ఉన్నారు. మల్కాజిగిరిలో ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, తాజా మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి టికెట్ తనదంటే తనదేనన్న ధీమాతో ప్రచారం చేసుకుంటున్నారు. మైనంపల్లి అయితే ఏకంగా ప్రత్యేక ఎన్నికల ప్రచార వాహనాలను సైతం తయారు చేయించి వాడవాడలా ప్రచారం చేస్తూ తిరిగేస్తున్నారు. ఇక చింతల కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్ విజయశాంతి సైతం టికెట్ దక్కుతుందన్న ఆశతో ప్రచారం మొదలెట్టారు. దీంతో మల్కాజిగిరిలో పార్టీ గ్రూపులుగా చీలిపోయింది. తమకు టికెట్ ఇస్తారో..ఇవ్వరో పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేయాలని కనకారెడ్డి పేర్కొంటున్నారు. మేడ్చల్ నియోజకవర్గానికి వచ్చేసరికి ఎంపీ మల్లారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. తాజా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డితో రాజీ చేసుకోవాలని సూచించారు. అయితే, జరిగేదేదో కేసీఆర్ సమక్షంలో జరిగితేనే తాను చర్చలకు వస్తాను తప్ప మరేచోటికి వచ్చేది లేదని సుధీర్‌రెడ్డి స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో మేడ్చల్‌లోనూ ప్రచారం అయోమయంగానే కొనసాగుతోంది.
ఖైరతాబాద్‌పై కిరికిరి..
ఈ నియోజకవర్గం విషయంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో టికెట్ ఆశిస్తున్న ముగ్గురు అభ్యర్థుల్లో అందోళన వ్యక్తమవుతోంది. తొలుత గోషామహల్ స్థానానికి వెళ్లేందుకు నిర్ణయించుకున్న మాజీ మంత్రి దానం నాగేందర్.. మనసు మార్చుకుని ఖైరతాబాద్ నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గంలో వినాయక చవితి, బతుకమ్మ, దసరా ఉత్సవాల్లో పాలుపంచుకుంటూ తానే అభ్యర్థినని ప్రకటిస్తున్నారు.
కానీ ‘టికెట్ నీకే’ అన్న అభయం పార్టీ అధినేత పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం దానం శిబిరంలో ఆలజడి రేపుతోంది. మరోవైపు కార్పొరేటర్ విజయారెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి సైతం టికెట్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. విజయారెడ్డి కూడా ఇక్కడి బస్తీల్లో జరిగే ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో కాలేరు వెంకటేష్ పేరుపై ఏకాభిప్రాయం వచ్చినా.. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ సీటు ‘కాలేరు’కు ఇస్తే ఒప్పుకోమని, తమలో ఎవరికి ఇచ్చినా ‘ఓకే’నంటూ నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు నిరసన గళాలు వినిపిస్తున్నారు. అయితే, ఎవరి స్థానం ఏంటో తెలియాలంటే మాత్రం టీఆర్‌ఎస్ రెండో జాబితా వెలువడే దాకా వేచి చూడాలిసందే.
Comments
Please login to add a commentAdd a comment