సాక్షి, సంగారెడ్డి : సింగూరు నీటిని హరీష్‌రావు దొంగిలించారన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై టీఆర్‌నేతలు నిప్పులు చెరిగారు. జగ్గారెడ్డి విమర్శలపై టీఆర్‌ఎస్ నేతలు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, జిల్లా పరిషత్ ఛైర్మన్ రాజమణి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. 'జగ్గారెడ్డి తీరుతో ఎందుకు గెలిపించామా అని సంగారెడ్డి ప్రజలు ఆవేదన పడుతున్నారు. జగ్గారెడ్డి వ్యవహారం చూసి పిచ్చి వాడిని గెలిపించాము అని సంగారెడ్డి ప్రజలు భావిస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తున్నాడు. నీటి సమస్యలు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం అన్ని పనులు చేస్తుంటే, నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభం. నీకు జనాలు ఓట్లు వేసి ఏం లాభం. జగ్గారెడ్డి ముమ్మాటికీ చెల్లని రూపాయి. ఎమ్మెల్యేగా గెలవగానే, తెలంగాణకు ద్రోహం చేశావు. ఈదులనాగులపల్లి, ధర్మసాగర్, కంది, చేర్యాలలో ప్రభుత్వ భూములు కబ్జా చేసి అమ్ముకున్నావు. ఇంతటి నీచ చరిత్ర రాష్ట్రంలో మరో నాయకునికి లేదు. తప్పని పరిస్థితిలో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల రైతులను కాపాడాలనే ఉద్దేశంతో నీటిని విడుదల చేశారు. ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రోత్సహిస్తే ఉక్కుపాదం కింద నలిగిపోక తప్పదు. జగ్గారెడ్డి ఎన్ని జన్మలు ఎత్తినా హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని అడ్డుకోలేవు. కేసులు, శిక్షల నుంచి తప్పించుకోవడానికే జగ్గారెడ్డి కేసీఆర్‌ను పొగుడుతున్నాడు' అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మండిపడ్డారు.
'జగ్గారెడ్డి గత కొన్ని నెలలుగా ప్రెస్ మీట్లు పెట్టి హరీష్ రావుపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. తప్పుడు హామీలు ఇచ్చి గెలుపొందిన జగ్గారెడ్డి వాటిని నెరవేర్చకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. తాను చేసిన నేరాలకు జైలుకు వెళ్ళక తప్పదనే భయంతోనే జగ్గారెడ్డి హరీష్ రావు మీద విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం హరీష్ రావు చేసిన కృషి నువ్వు చేసిన నిర్వాకాలు అందరికి తెలుసు. కార్గిల్ యుద్ధ సమయంలో కార్గిల్ అమరవీరుల కోసం డబ్బులు వసూలు చేసి వాటిని స్వాహా చేసిన చరిత్ర జగ్గారెడ్డిది. సరిహద్దులో సైనికులు ఉండి శత్రువులతో పోరాడుతుంటే నువ్వు అక్రమంగా గుజరాత్ మహిళను అమెరికాకు తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చావు. వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశావు. ప్రజాసేవను వదిలిపెట్టి ఇటువంటి విమర్శలు చేస్తూ కాలం గడిపితే చరిత్రలో పుట్టగతులుండవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంవత్సరానికి 7టీఎంసీల నీటిని హైద్రాబాద్‌కు తరలించారు. అప్పుడు ఎందుకు స్పందించ లేదు. రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అందుకే ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. శిక్షల నుంచి తప్పించుకోవడానికి నిష్కలంకమైన హరీష్ రావుపై విమర్శలు చేస్తున్నావు. కాళేశ్వరం నుంచి సింగూర్‌ను నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎక్కువ నీరు ఉన్న దగ్గరి నుంచి అవసరం ఉన్న ప్రాంతాలకు తరలిస్తారు. కృష్ణ, గోదావరిలోంచి నీటిని హైదరాబాద్ తాగునీటి కోసం తరలిస్తున్నారు. దీన్ని అక్కడి ప్రజలు అడ్డుకుంటే హైదరాబాద్ పరిస్థితి ఏంటి. చట్ట సభల్లో కూర్చొని జగ్గారెడ్డి గల్లీ నాయకునిలా వ్యవహరిస్తున్నాడు. గల్లీ రాజకీయాలపై ఆసక్తి ఉంటే వచ్చే ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చెయ్యి. ప్రజా ఆదరణ ఉన్న నాయకులను విమర్శించి జగ్గారెడ్డి వికృత ఆనందం పొందుతున్నాడు. జగ్గారెడ్డి తన చర్యలతో సంగారెడ్డి నియోజకవర్గానికి నష్టం చేస్తున్నాడు' అని మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ పేర్కొన్నారు.
'జగ్గారెడ్డి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేసింది ఏం లేదు. హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగదు. ఎమ్మెల్యేగా వీలైతే అభివృద్ధి చెయ్యాలి. లేకపోతే మా ప్రభుత్వమే అభివృద్ధి చేసుకుంటుంది' అని జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి అన్నారు.
కాగా, సింగూరు నీటిని హరీష్‌రావు దొంగిలించారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. హరీష్‌రావు ఆదేశాల మేరకే సింగూరు నీటిని నిజాంసాగర్‌కు తరలించారని విమర్శించారు. నీటిని తరలిస్తుంటే ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సింగూరుపై హరీష్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment