వికారాబాద్: టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోస్తూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పలువురు జిల్లా నాయకులు ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. పదవుల కేటాయింపులో, పార్టీలో తమకు ప్రాధాన్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అన్ని అంశాల్లో పెద్ద పీట వేస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని కినుక వహిస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకొని,పార్టీ అభ్యున్నతి కోసం కష్టపడిన వారికి, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ సీట్లను ఆశిస్తున్న వారు సంపన్నులా.. కాదా?పార్టీలోని పెద్దల వద్ద పలుకుబడి ఉందా.. లేదా? అనేవిషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
వలస నేతలకు కీలక పదవులు..
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీలో ఉండి, టీఆర్‌ఎస్ అభ్యర్థులు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి సైతం నామినేటెడ్ పదవులు కట్టబెట్టేందుకు జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచిఉన్న వారిని కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కీలక పదవులుకట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారని పలువురు నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సీనియర్లను పక్కనపెట్టారనే అపవాదు మూటగట్టుకున్నారు. అధికారిక, పార్టీ కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని పేర్లు చెప్పేందుకు ఇష్టపడని కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. సీనియర్లను విస్మరించి, ఇటీవల గులాబీ జెండా ఎత్తుకున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు.(కరోనా నిధులు కూడా కాళేశ్వరానికే: అరవింద్)
అధిష్టానానికి ఫిర్యాదు..
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి, గెరిగెట్‌పల్లి రాంచంద్రరెడ్డి, నరోత్తంరెడ్డి, శుభప్రద్‌పటేల్, ఎండీ హఫీజ్ తదితరులు ఎమ్మెల్యే ఆనంద్‌తో ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. ఎమ్మెల్యే తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని సన్నిహితుల వద్ద మదనపడుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ సీనియర్లను పక్కన పెట్టి ఇతరులకు టికెట్లు ఇచ్చారని,పార్టీ పదవులను సైతం వలస నాయకులకే కట్టబెట్టారని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై పలువురు సీనియర్ నాయకులు ఇటీవల హైదరాబాద్ వెళ్లి అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కొత్త వ్యక్తికి కట్టబెట్టేందుకు..
ఆది నుంచి టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న తిమ్మని శంకర్ చా లా కాలంగా వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. మూడేళ్లుగా ఈ పదవి ఖాళీగానే ఉంది. నియోజకవర్గంలోని అన్ని మార్కెట్ కమిటీలను నియమించి, వికారాబాద్‌ను మాత్రం వదిలేశారు. అయితే సీనియర్లను ఎవరినీ ఈ పదవి కోసం పరిశీలించకుండా, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన ఓ వ్యక్తికి పదవిని అప్పగించేందుకు ఎమ్మెల్యే మొగ్గు చూపుతున్నారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సమన్వయ లోపం..
ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా కొనసాగుతున్న కొండల్‌రెడ్డి సైతం ఎమ్మెల్యే ఆనంద్ నిర్ణయాలపై తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పార్టీ, ఎమ్మెల్యే గెలుపుకోసం శక్తివంచన లేకుండా పనిచేసిన తనను పదవి నుంచి తప్పించేందుకు ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారని మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని తాండూరుకు చెందిన ఓ నాయకుడికి ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు తమ లెటర్ హెడ్‌పై ఆమోదం తెలిపినట్లు వినికిడి. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యే మధ్య సమన్వయలోపం కనిపిస్తోందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. జిల్లాలోని పరిస్థితులను తెలుసుకున్న ఆ పార్టీ అధిష్టానం పరిస్థితులను చక్కదిద్దాలని ఎంపీ రంజిత్‌రెడ్డిని పురమాయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment