సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తుందని, బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతోందన్నారు. చావు అంచులదాకా వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. సిద్ధించిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అయితే రాష్ట్రం బాగుంటేనే సరిపోదని, దేశం కూడా బాగుండాలని ఆకాంక్షించారు.
వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు కర్ణాటకకు మించి భూముల ధరల పెరిగాయన్నారు. కర్నాటక కన్నా వికారాబాద్‌లో భూముల ధరలు ఎక్కువని, ఇక్కడ ఒక ఎకరం అమ్మితే అక్కడ మూడు ఎకరాలు కొనొచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడకపోతే వికారాబాద్ జిల్లా అయ్యేదా అని ప్రశ్నించారు. వికారాబాద్‌కు మెడికల్, డిగ్రీ కాలేజీలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
‘ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు తెలంగాణలో ఉన్నాయి. రైతు బీమాతో రైతు కుటుంబాలకు అండగా ఉంటున్నాం. రైతాంగాన్ని కాపాడుకోవాలి, పల్లె సీమలు కళకళలాడాలనేదే మా ఉద్ధేశం. నీటి బకాయిలు కూడా మాఫీ చేశాం. తెలంగాణ పల్లెలన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలను ఉచితాలంటూ కేంద్రం ప్రచారం చేస్తోంది. ఉచిత పథకాలు రద్దుచేయాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చెబుతోంది. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి.
చదవండి: వికారాబాద్‌లో సీఎం కేసీఆర్.. కలెక్టరేట్, టీఆర్‌ఎస్ ఆఫీస్ ప్రారంభం
మోదీ 8 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు. సాక్ష్యాత్తు ప్రధాన మంత్రే తెలంగాణకు శత్రువు అయ్యారు. సంస్కరణల పేరుతో మనకు శఠగోపం పెట్టి షావుకార్లకు నింపుతున్నారు. ప్రధాని నిన్న గంట మాట్లాడారు. అంతా గ్యాసే. నెత్తికి రుమాల్ కట్టి వేషం తప్ప ఏముంది. డైలాగులు తప్ప దేశానికి మంచిమాట ఉందా. బీజేపీ జెండా పట్టుకొని నా బస్‌కు అడ్డం వసార్తా?. వికారాబాద్‌కు నేనేం తక్కువ చేశానో ప్రజలు చెప్పాలి. బీజేపీని నమ్ముకుంటే మనకు మళ్లీ పాత రోజులే వస్తాయి.
వికారాబాద్, తాండూరు, చేవెళ్లకు కృష్ణా నీళ్లను తెస్తాం. కేంద్రం తీరు వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. రాష్ట్రాలకు మేలు చేయకపోగా పథకాలను రద్దు చేయాలంటున్నారు. గ్యాస్, పెట్రోల్ ధర గతంలో ఎంత.. ఇప్పుడు ఎంత ఉంది. బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలి. కేంద్రంలోనూ రాష్ట్రాల హక్కులను కాపాడే ప్రభుత్వం రావాలి’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment