సాక్షి, హైదరాబాద్: ఏకగ్రీవాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ జోరు ప్రదర్శించింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక మొత్తం 76 వార్డుల్లో (సోమవారం వరకు 40 వార్డులు కలుపుకుని) టీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటీలేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంఐఎం అభ్యర్థులు మూడు వార్డుల్లో ఏకగ్రీవమయ్యారు. దీంతో పాటు ఇంకా ఈనెల 22న ఎన్నికలు జరగకుండానే సగం సీట్లు ఏకగ్రీవం కావడంతో పరకాల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.
ఈ మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు గాను 11 వార్డులు ఏకగ్రీవం కావడంతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా టీఆర్‌ఎస్ చేజిక్కించుకున్నట్టు అయ్యింది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా సోమవారానికే 6 వార్డులు ఏకగ్రీవమై టీఆర్‌ఎస్ ఖాతాలో పడగా, మంగళవారం నాడు 5 వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో ఆ సంఖ్య 11కు చేరింది. మంగళవారం టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఆరవ వార్డు లో దామెర మొగిలి, ఏడవ వార్డులో నల్లెల జ్యోతి, తొమ్మిదో వార్డులో కోడూరి మల్లేశం, 10వ వార్డులో పసుల లావణ్య, పన్నెండవ వార్డులో బండి రాణి ఏకగ్రీవమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మంగళవారం అధికారులు ప్రకటించిన వివరాల మేరకు...
వివిధ మున్సిపాలిటీల వారీగా...
సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 5, 19, 36 వార్డులలో, వేములవాడ మున్సిపాలిటీలోని 6వ వార్డులో, సత్తుపల్లి మున్సిపాలిటీలో 4, 5, 8, 18 వార్డులలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డోర్నకల్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన వాంకుడోతు వీరన్న 5వ వార్డు నుంచి ఏకగ్రీవంగా గెలిచారు. మరిపెడ మున్సిపాలిటీ 9వ వార్డులో, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీలో 2వ వార్డు నుంచి, వికారాబాద్ మున్సిపాలిటీలో 14, 25 వార్డులలో, దుబ్బాక మున్సిపాలిటీ 12వ వార్డులో, హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 13, 15 వార్డులలో ఏకగ్రీవమయ్యారు.
కోస్గి మున్సిపాలిటీలో 10వ వార్డులో, సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలోని 6, 12 వార్డు లు, సదాశివపేట మున్సిపాలిటీ 5వ వార్డు నుంచి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ 7వ వార్డులో, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ 28వ వార్డులో జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో 26, 29 వార్డులను, ర్యాపేట మున్సిపాలిటీ 5వ వార్డులో, బాన్సువాడ మున్సిపా లిటీ 4వ వార్డులో, చెన్నూర్ మున్సిపాలిటీ 2, 5, 18 వార్డు ల్లో, నిర్మల్ మున్సిపాలిటీ 10వ వార్డులో, టీఆర్‌ఎస్ పక్షాన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భైంసా మున్సి పాలిటీ 16వ వార్డులో ఎంఐఎం నుంచి ముంతాజ్ ఏకగ్రీవమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment