
సాక్షి, కరీంనగర్ : ఆర్టీసీ సమ్మెపట్ల ప్రభుత్వ వైఖరితో మరో కార్మికుడి గుండె ఆగింది. కరీనగర్-2 డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్న కరీంఖాన్ బుధవారం గుండెపోటుతో మరణించారు. ఆయన కుటుంబాన్ని అఖిలపక్షం నేతలు పరామర్శించారు. కరీం మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్మికులతో చర్చలు జరపకుండా డెడ్‌లైన్ పెట్టి మానసిక ఆందోళనకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెండివైఖరితోనే కరీం ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది చనిపోతే సీఎం స్పందిస్తారని మృతుడి కుమారుడు మహమ్మద్ అసద్‌ఖాన్ కన్నీరుమున్నీరయ్యాడు.
పట్టు వీడాల్సింది కార్మికులు కాదు..
ఆర్టీసీ మెకానిక్ కరీంఖాన్ మృతిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. కరీంఖాన్ మృతి బాధాకరమని, సీఎం కేసీఆర్ బెదిరింపులు, డెడ్ లైన్‌లు కార్మికుల ఉసురు తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పెట్టిన గడువును కార్మికులు లెక్క చేయలేదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటంతో వారి ఆవేదనను అర్థం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. మొండిపట్టుదల వీడాల్సింది కార్మికులు కాదని, ముఖ్యమంత్రి కేసీఆరే మొండితనం వీడి చర్చలు జరపాలని హితవు పలికారు. ఇంకెంతమంది ప్రాణాలు పోతే సీఎం స్పందిస్తారో చెప్పాలని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment