సాక్షి, హైదరాబాద్ : పార్టీ విధానాలపై అసమ్మతి గళం విప్పిన కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూకుడుకు తెలంగాణ తెలుగుదేశం కళ్లెం వేసే ప్రయత్నం చేసింది. ‘ఆయనతో పాటు ఇంకొందరు కీలక నేతలు పార్టీని వీడబోతున్నారు’ అన్నది కేవలం ప్రచారమేనని, అలాంటి వార్తలు చూసి కింది స్థాయి నేతలెవ్వరూ గందరగోళానికి గురికావద్దని పిలుపునిచ్చింది. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి శనివారం మీడియా సమావేశంలో ఉమ్మడి ప్రకటన చేశారు.
ఆధినాయకుడు చెప్పిందే వేదం : క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో తప్పిదాలకు పాల్పడే ఎంతటి నాయకుడినైనా సహించబోమని టీటీడీపీ చీఫ్ రమణ అన్నారు. ‘‘రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలిశారని, తనతోపాటు పార్టీని వీడే నాయకుల జాబితా ఇచ్చారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలి. అసలు ఆ ప్రచారంలో వాస్తవం లేదన్న విషయాన్ని టీడీపీ శ్రేణులే ప్రజలకు తెలియజెప్పాలి. అక్టోబర్ 8న పార్టీ అధినేత చంద్రబాబుతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ముఖ్యనాయకులంతా కట్టుబడి ఉండాలి’’ అని రమణ తెలిపారు.
పొత్తులపై ఏమన్నారంటే.. : టీటీడీపీలో తాజా వివాదానికి అసలు కారణమైన పొత్తుల వ్యవహారంపై నేతలు ఆచితూచి స్పందించారు. 2019 ఎన్నికల్లో.. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా, టీడీపీతో భావసారూప్యం కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని అధినేత చంద్రబాబు యోచిస్తున్నారని రమణ తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే దిశగా టీడీపీ ఏనాడూ ఆలోచన చేయలేదని పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment